AP Rains
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ములుగు జిల్లాలో నాగారంలో, మంగపేటలో, ఆలుబాకలో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రవీంద్ర నగర్, కౌటాల, సుస్మీర్, సోమిని, కుష్నపల్లి, నాయికపుగూడలో భారీ వర్షాలు పడ్డాయి. కరీంనగర్‌లోని పలు ప్రాంతాలు, భద్రాద్రి జిల్లా మణుగూరులో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కరీంనగర్ సిటీలో రోడ్లపై నీళ్లు నిలిచాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రామలక్ష్మణపల్లె, పదిర గ్రామాల మధ్య మానేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలంలోని భారీ వర్షాలు కురిశాయి. దూప్ సింగ్ తండాకు వెళ్లే దారిలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
మహబూబాబాద్ వద్ద మున్నేరు వాగుపై చెక్ డ్యామ్ మీదుగా కూడా వరదనీటి ఉద్ధృతి పెరిగింది. మంచిర్యాల జిల్లాలోని చిన్న తిమ్మాపూర్‌లో ఎర్ర వాగు ఉప్పొంగింది.
ఖమ్మంలో మున్నేరులోనూ వరద ఉద్ధృతి పెరిగింది. ఇక భద్రాద్రి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్ఆయి. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లోని సింగరేణి ఓపెన్ కాస్టు బొగ్గు గనుల్లో 70 వేల టన్నులకు పైగా ఉత్పత్తి నిలిచిపోయింది.
హైదరాబాద్‌లోనూ రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఇవాళ కూడా తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.