హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. వరదలో చిక్కుకున్న కారు, ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన స్థానికులు

భారీ వర్షం ధాటికి రోడ్లపై నీరు వరదను తలపించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల కార్లు, బైక్ లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.

Hyderabad Rains : హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. రాంనగర్ లో వరదలో ఓ కారు చిక్కుకుంది. భారీ వర్షానికి కారు నీటిలో మునిగిపోయింది. డోర్లు ఓపెన్ కాకపోవడంతో కారులో నలుగురు ప్రయాణికులు చిక్కుకున్నారు. స్థానికులు రిస్క్ చేసి కారులో ఉన్న వారిని కాపాడారు. కారు అద్దాలు పగలగొట్టి కారులోంచి వారిని బయటకు తీసుకొచ్చారు. రాంనగర్ స్ట్రీట్ నెంబర్ 17లో ఈ ఘటన జరిగింది. అటు యూసుఫ్ గూడలో వర్షం నీటిలో కారు కొట్టుకుపోయింది. ఒక్కసారిగా భారీగా వరద రావడంతో కారు కొట్టుకుపోయింది.

కుండపోత వాన నగరాన్ని ముంచెత్తింది. భారీ వర్షం ధాటికి రోడ్లపై నీరు వరదను తలపించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల కార్లు, బైక్ లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉధృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. స్థానిక యువకుడు ప్రణీత్ యాదవ్ అతడి స్నేహితులు రిస్క్ చేసి కారును గోడ పక్కకు తీసుకొచ్చారు. అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. జనజీవనం స్థంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. వీధులను వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి అంటే.. వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ నగరంలో గంట సేపు కురిసిన కుండపోత వాన బీభత్సం సృష్టించింది. చాలా కాలనీలు జలమయం అయ్యాయి. నగరంలోని చాలా సర్కిళ్లలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ సర్కిల్ లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

సినిమా థియేటర్‌లో వర్షం నీరు.. ఆందోళనలో ప్రేక్షకులు
హైదరాబాద్ నగరంలో కుండపోత వానకు పంజాగుట్టలోని పీవీఆర్ సినీ మాల్ లీక్ అయ్యింది. వర్షపు నీరు ధారలుగా సీట్లపై పడటంతో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం నీరు పడుతున్నా.. సినిమా ప్రదర్శనను యాజమాన్యం నిలిపివేయలేదు. దీంతో ప్రేక్షకులు సీరియస్ అయ్యారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. అయితే యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా స్పందించింది. సినిమా చూసే వారు చూడొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో గొడవ మరింత పెద్దదైంది. ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. చివరికి సినిమా ప్రదర్శనను నిలిపివేసింది యాజమాన్యం.

Also Read : మాజీ మంత్రి హరీశ్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు వర్షం

ట్రెండింగ్ వార్తలు