Heavy Rains
Heavy Rains : తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే, ఈ సమయంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని, గురువారం నాటికి వాయుగుండంగా బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్జ్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో వర్షాలు..
తెలంగాణలో వారం రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ (బుధవారం) పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
వచ్చే మూడు నెలలు..
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతు పవనాలతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించి లాంగ్ రేంజ్ ఫోర్ కాస్ట్‌ను విడుదల చేసింది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలలు 112శాతం కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అత్యంధిక వర్షపాతం నమోదు..
ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో వర్షాలు దంచికొట్టాయి. సెప్టెంబర్ 30వ తేదీతో వర్షాకాలం ముగిసింది. అయితే, నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సగటు వర్షపాతం 74.07 సెంటీమీటర్లు కాగా.. 98.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కన్నా 33శాతం ఎక్కువ. 12 జిల్లాల్లో వంద సెంటీమీటర్లకుపైగా సగటు వర్షపాతం నమోదైంది.
మొత్తం ఏడు జిల్లాల్లో సాధారణం కన్నా 60శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కాగా.. 16 జిల్లాల్లో సాధారణం కన్నా 20 నుంచి 59శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. పది జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతంనమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 145.74 సెంటీమీటర్లు, అదిలాబాద్ జిల్లాలో 136.34, కామారెడ్డిలో 132.87, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 131.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.