బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్‌తోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొద్దిరోజులు గా కురుస్తున్న వర్షాలతో పత్తి, మక్క, అపరాల పంటలకు నష్టం వాటిల్లింది. గురువారం అక్టోబరు24న కూడా పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆంధప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఉత్తరవాయవ్య దిశగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు ప్రయాణించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల గురువారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వివరించారు.
బుధవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాలేరు. మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిం ది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన వర్షానికి వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 15.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలోని 23 మండలాల్లో వర్షం కురువగా, అత్యధికంగా తిప్పర్తిలో 32.9 మి.మీ. వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 17.93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌లో మోస్తరు వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, అమ్రాబాద్ మండలాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల, జన్నా రం, లక్షెట్టిపేట, కోటపల్లి, దండేపల్లి, వేమనపల్లి, జైపూర్‌లలో వర్షం కురిసింది.
గ్రేటర్ హైదరాబాద్ లోనూ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో రాగల రెండ్రోజులు గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో బుధవారం గ్రేటర్ హైదరాబాద్ లోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మల్కాజిగిరిలో అత్యధికంగా 2.9 సెంటీమీటర్లు, సఫిల్‌గూడలో 2.6, వెస్ట్‌మారేడుపల్లిలో 2.2, అడ్డగుట్టలో 2.1, నేరేడుమెట్‌లో 1.9, కాప్రాలో 1.3, అల్వాల్, ఉప్పల్‌లో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.