High Court Dissatisfied With Control Measures Of Corona Cases
High Court dissatisfied with control of corona : తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసహనం వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు, థియేటర్లు, బార్లు, పబ్‌లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరీక్షలు చేపడుతున్న విధానాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది.
ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పరీక్షల సంఖ్యను నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వొకేట్ జనరల్ చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుంటే.. పరీక్షలను నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్ట్ ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగంగా జరపాలని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల రేటు స్పష్టంగా వెల్లడించాలని హైకోర్టు పేర్కొంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని సూచించింది. కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది.
అలాగే.. రాష్ట్రంలోఅనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలు, నిబంధనలు పాటించని వారిపై నమోదు చేస్తున్న కేసులు, జరిమానాలకు సంబంధించిన వివరాలను 48 గంటల్లోగా తమకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.