High Court
High Court : తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అభ్యంతరం చెబుతూ కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా శుక్రవారం కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్ల పై వాదనలు ముగిశాయి. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను కోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామని సీజే ధర్మాసనానికి తెలిపారు.
అసెంబ్లీలో చర్చించిన తరువాతనే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఏజీ చెప్పిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలాఉంటే.. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం, కమిషన్‌కు మూడు వారాలు, ప్రతివాదుల కౌంటర్ పై జవాబివ్వడానికి పిటిషనర్లకు వారం గడువును ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ మొదలు పెట్టింది. ఈ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ తోపాటు పలువురిని కమిషన్ విచారించింది. దాదాపు 13 నెలల పాటు వందలాది మందిని విచారించిన అనంతరం కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని పేర్కొంటూ కేసీఆర్, హరీశ్ రావులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం సైతం ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, కమిషన్ నివేదికపై పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.