జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఏం చేస్తున్నాయంటే?

రేవంత్ సర్కార్ పవర్‌లోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఏం చేస్తున్నాయంటే?

Revanth Reddy and KTR

Updated On : October 13, 2025 / 9:47 PM IST

Jubilee Hills Bypoll 2025: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జూబ్లీహిల్స్ బైపోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. తమ సీటును తిరిగి గెలిచి తీరాలనే ప్లాన్‌తో గ్రౌండ్‌లోకి దిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్‌లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది గులాబీ దళం. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఇప్పటికే జూబ్లీహిల్స్ పొలిటికల్‌ పిచ్‌లో హీట్‌ను క్రియేట్ చేసింది.

రేవంత్ సర్కార్ పవర్‌లోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. ఈ 20 నెలల కాలంలో రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది. అది నిజమని జూబ్లీహిల్స్ రిజల్ట్ ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటోంది కారు పార్టీ. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపోటములు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావం చూపుతాయన్న అంచనాలున్నాయి.

Also Read: Nobel 2025: ఆర్థిక శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం.. ఏం సాధించారంటే..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారలో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. హైదరాబాద్‌లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్‌ మళ్లీ రావాలని, అది జూబ్లీహిల్స్‌ నుంచి మొదలు కావాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్న కేటీఆర్..మళ్లీ ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు.

అయితే మళ్లీ ఎన్నికలు రావడానికి రెండేళ్ల సమయం ఉందని, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో ఏమైనా జరగవచ్చని కేటీఆర్ కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీఆర్ఎస్ గెలిస్తే రెండేళ్లు ఆగాల్సిన పనిలేదని కేటీఆర్ చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏమైనా జరగొచ్చన్న కేటీఆర్ మాటల వెనుక ఆంతర్యం ఏమై ఉంటుదన్న చర్చ జరుగుతోంది.

ఉప ఎన్నికలో గెలవలేకపోతే తీవ్ర ప్రభావం!
సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానం అసంతృప్తి, రేవంత్‌కు మంత్రులకు మధ్య విభేదాలు, మంత్రివర్గంలోని చాలా మంది మంత్రుల మధ్య గొడవలు, తమకు ఏ పనులు కావడం లేదన్న అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తులను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ ఈ వ్యాఖ్యలను చేశారన్న టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవలేకపోతే అది ఆ పార్టీపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే దాని ప్రభావం రేవంత్ సర్కార్‌పై ఉంటుందని కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేంత తీవ్రంగా ఉంటుందా అన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు రెండేళ్ల వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, అంతలో ఏమైనా జరగొచ్చని, పరోక్షంగా రేవంత్ సర్కార్ పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్లుగా కేటీఆర్ కామెంట్‌ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

అందుకే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెబుతున్నారు. బైఎలక్షన్‌లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని, అప్పుడు రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని కేటీఆర్ చెప్పడంలో అంతర్యం అదేనన్న చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉండబోతుందో..ఉప ఎన్నికలో గెలుపోటములు రాష్ట్ర రాజకీయాలను ఎంతలా ప్రభావితం చేయబోతున్నాయో చూడాలి మరి.