Nobel 2025: ఆర్థిక శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం.. ఏం సాధించారంటే..

మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో, పీస్, లిటరేచర్ విభాగాల్లో ఇప్పటికే నోబెల్ పురస్కారాలు ప్రకటించేసిన సంగతి తెలిసిందే.

Nobel 2025: ఆర్థిక శాస్త్రంలో ఈ ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం.. ఏం సాధించారంటే..

Updated On : October 13, 2025 / 8:46 PM IST

Nobel 2025: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం దక్కింది. జోయ‌ల్ మోకిర్‌, ఫిలిప్ అఘియాన్‌, పీట‌ర్ హోవిట్‌ల‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డు
వ‌రించింది. ఆవిష్క‌ర‌ణ‌ల‌ ఆధారిత ఆర్థిక వృద్ధిని ఈ శాస్త్ర‌వేత్త‌లు వివ‌రించిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. బహుమతిగా వీరికి 1.2 మిలియన్ డాలర్లు అందనుంది. కాగా, నోబెల్ పుర‌స్కారంలో సగం బ‌హుమ‌తి మోకిర్ కి వెళ్ల‌నుంది. మిగతా స‌గం ఫిలిప్‌, హోవిట్లకు ద‌క్కనుంది. మోకిర్, హోవిట్ అమెరికాకు చెందిన ఎకనామిస్టులు. అఘియాన్ బ్రిటన్ కు చెందిన ఆర్థికవేత్త.

సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి కావాల్సిన అంశాల‌ను గుర్తించిన‌ందుకు మోకిర్ ఈ అవార్డ్ కు ఎంపికైనట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. క్రియేటివ్ డిస్ట్ర‌క్ష‌న్ ద్వారా నిరంతర వృద్ధి సిద్దాంతానికిగాను మిగతా ఇద్ద‌రికి నోబెల్ ప్రకటించారు. వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన దీంతో ముగిసింది.

మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో, పీస్, లిటరేచర్ విభాగాల్లో ఇప్పటికే నోబెల్ పురస్కారాలు ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఈ బహుమతులు స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో స్థాపించబడ్డాయి. 1901 నుండి అందజేయబడుతున్నాయి. ప్రపంచ యుద్ధాల కారణంగా కొన్నిసార్లు ఇవ్వలేకపోయారు.

ఆర్థిక శాస్త్ర బహుమతి చాలాకాలం తర్వాత స్థాపించబడింది. మొదట 1969లో నార్వేకు చెందిన రాగ్నార్ ఫ్రిష్, నెదర్లాండ్స్‌కు చెందిన జాన్ టిన్బెర్గెన్ డైనమిక్ ఎకనామిక్ మోడలింగ్‌లో చేసిన కృషికి దీనిని గెలుచుకున్నారు. టిన్బెర్గెన్ సోదరుడు నికోలాస్ కూడా 1973లో వైద్య రంగంలో బహుమతిని గెలుచుకున్నారు.

గత సంవత్సరం ఆర్థిక శాస్త్ర అవార్డును US కు చెందిన విద్యావేత్తలు సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్, డారన్ అసెమోగ్లు గెలుచుకున్నారు. వలస రాజ్యాల పాలన, ప్రభుత్వ సంస్థల స్థాపన మధ్య సంబంధాన్ని అన్వేషించిన పరిశోధనకు గాను వీరికి పురస్కారం దక్కింది. కొన్ని దేశాలు దశాబ్దాలుగా పేదరికంలో ఎందుకు చిక్కుకున్నాయో వారు అందులో వివరించారు.

Also Read: ట్రంప్‌కి నోబెల్ మిస్ అయింది కానీ.. ఈ అత్యున్నత పురస్కారం దక్కించేసుకున్నారు..