Jubilee Hills Fake Votes: జూబ్లీహిల్స్‌లో 20వేల దొంగ ఓట్లు ఉన్నాయని అనుమానం- కేటీఆర్ సంచలనం
జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రలోభ పెట్టేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

KTR
Jubilee Hills Fake Votes: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. ఈ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దొంగ ఓట్ల వ్యవహారంపై బీఆర్ఎస్ నేతల బృందం ఎన్నికల కమిషన్ ను కలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేసింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక బృందం ఈసీని కలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జూబ్లీహిల్స్ బై పోల్ లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రలోభ పెట్టేలా కాంగ్రెస్ కార్యక్రమాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. దాదాపు 20వేల దొంగ ఓట్లు ఉన్నట్లు తమకు అనుమానం ఉందన్నారు. దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్నారు. అధికార ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ కి అర్జీలు పెట్టుకుంటున్నారని విమర్శించారు.
దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసిన కేటీఆర్.. ఎన్నికల సంఘానికి మూడు విజ్ఞప్తులు ఇచ్చారు. ఓట్ల చోరీపై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరగాలని, క్షేత్రస్థాయిలో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నామినేషన్ ప్రక్రియ ముగిసేలోపు విచారణ పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ”రాహుల్ గాంధీ అక్కడ ఓట్ల చోరీ అని గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలో మాత్రం వారే దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దొంగ ఓట్లపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. విచారణ కోరాం.
కాంగ్రెస్ పార్టీ 20 వేల వరకు దొంగ ఓట్ల కోసం ప్రణాళికలు రచించింది. నియోజకవర్గంలో ఒక ఇంట్లో 250 ఓట్లు, మరో ఇంట్లో 180, ఇంకొక ఇంట్లో 80, మరొక ఇంట్లో 90 ఓట్లు ఉన్నాయి. ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయి. తనిఖీకి వెళ్లినప్పుడు వారంతా ఎవరో తనకు తెలియదని ఇంటి యజమాని చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే అవన్నీ దొంగ ఓట్లు అని తేలింది” అని కేటీఆర్ అన్నారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఏం చేస్తున్నాయంటే?