Dilsukhnagar Blast Case : దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు.. రేపే హైకోర్టు తీర్పు..

ఈ కేసులో యాసిన్ భత్కల్ ను కీలక సూత్రధారిగా గుర్తించింది.

Dilsukhnagar Blast Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్లాస్ట్ కేసును NIA దర్యాఫ్తు చేసింది.

157 మంది సాక్షులను విచారించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ ను కీలక సూత్రధారిగా గుర్తించింది. ఇప్పటికే ఐదుగురు నిందితులకు NIA స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితులు NIA కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం కోర్టు తీర్పును వెలువరించనుంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బాంబు పేలుళ్ల ఘటన ఇప్పటికీ హైదరాబాద్ వాసులను వెంటాడుతూనే ఉంది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేష్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు చేసింది.

Also Read : మీనాక్షి నటరాజన్ సచివాలయానికి రావడంపై సీఎం, మంత్రులు విస్మయం..! ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయా?

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలింది కాసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌ (యూపీ), జియా-ఉర్‌-రెహమాన్‌ (పాకిస్థాన్‌), తెహసీన్‌ అక్తర్‌ (బీహార్‌), అజాజ్‌ షేక్‌ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 2016లోనే ఉరిశిక్ష ఖరారు చేసినా ఇంకా అమలు కాలేదు. దోషులను వెంటనే ఉరితీయాలని, తమకు న్యాయం చేయాలని బాంబు పేలుళ్ల ఘటన బాధితులు డిమాండ్ చేస్తున్నారు.