Hindu Ekta Yatra: లక్ష మందితో హిందూ ఏక్తాయాత్ర.. ముఖ్యఅతిథులుగా వచ్చేది ఎవరో తెలుసా?
హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు కరీంనగర్‌లో హిందూ ఏక్తాయాత్ర ప్రారంభమవుతుంది.
- Harishth Thanniru
- Published On : May 14, 2023 / 09:21 AM IST
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar: రాష్ట్రంలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు కరీంనగర్‌లో లక్షమందితో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4గంటలకు కరీంనగర్‌లో హిందూ ఏక్తాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరవుతారు. అంతేకాక, తరుణ్ ఛుగ్, ‘ది కేరళ స్టోరీ’ సినిమా డైరెక్టర్‌తో పాటు హీరోయిన్, టీం సభ్యులు పాల్గోనున్నారు. ఈ ఏక్తా యాత్రకు భారీగా జన సమీకరణపై తెలంగాణ బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. దాదాపు లక్ష మందితో హిందూ ఏక్తాయాత్రను నిర్వహిస్తామని ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించారు. ఆ మేరకు శ్రేణులను తరలించేందుకు పార్టీ నేతలు దృష్టి సారించారు.
కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. 2018 ఎన్నికల్లో 104 నియోజకవర్గాల్లో విజయం సాధించిన ఆ పార్టీ.. శనివారం వెల్లడైన 2023 ఎన్నికల ఫలితాల్లో కేవలం 66 స్థానాలకే పరిమితం అయింది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉండటంతో కర్ణాటకలోని బీజేపీ ఓటమి ప్రభావం తెలంగాణపై పడకుండా బీజేపీ ముందస్తు చర్యలు చేపట్టింది. హిందూ ఏక్తా యాత్ర ఫలితాల కంటే ముందే నిర్ణయించినప్పటికీ.. కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై పడకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నద్ధమయ్యారు.
Karnataka Election Result 2023: కర్ణాటకలో ప్రాంతాల వారీగా ఫలితాలు ఇలా.. 2018లో ఎన్ని? 2023లో ఎన్ని?
మరికొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కర్ణాటకలో విజయం సాధిస్తే తెలంగాణలోనూ దుకుడుగా వెళ్లొచ్చని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ కర్ణాటకలో ఓటమితో తెలంగాణలోని బీజేపీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో వచ్చే ఎన్నికల్లో విజయంపై ఆశలు సన్నగిల్లకుండా రాష్ట్ర బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
హిందూ ఏక్తా యాత్ర ఫలితాల కంటే ముందే నిర్ణయించిన కార్యక్రమం అయినప్పటికీ.. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతోపాటు రాబోయే కాలంలో వరుసగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ కేడర్ లో మరింత జోష్ నింపేందుకు బీజేపీ అధిష్టానం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
