Karnataka Election Result 2023: కర్ణాటకలో ప్రాంతాల వారీగా ఫలితాలు ఇలా.. 2018లో ఎన్ని? 2023లో ఎన్ని?

పాత మైసరు, కిత్తూరు కర్ణాటక, కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బెంగళూరు, కరావళి ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించింది.

Karnataka Election Result 2023: కర్ణాటకలో ప్రాంతాల వారీగా ఫలితాలు ఇలా.. 2018లో ఎన్ని? 2023లో ఎన్ని?

Karnataka Elections Result

Updated On : May 14, 2023 / 7:19 AM IST

Karnataka Polls: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కన్నడనాట విజయం సాధించారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే 113 స్థానాలు అవసరం ఉంది. శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 135 (42.88 ఓట్ల శాతం) స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ కేవలం 66 (36 ఓట్ల శాతం) స్థానాలకే పరిమితం అయింది. ఇక జేడీఎస్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేక పోయింది. ఆ పార్టీ కేవలం 19 (13.29 ఓట్ల శాతం) స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు నాలుగు (8.1 ఓట్ల శాతం) స్థానాల్లో విజయం సాధించారు.

ప్రాంతాల వారీగా ఫలితాలు ఇలా..

కర్ణాటక ఎన్నికల్లో ప్రాంతాల వారిగా చూస్తే కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంది. పాత మైసరు, కిత్తూరు కర్ణాటక, కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బెంగళూరు, కరావళి ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించింది.

Karnataka Election Results 2023: కర్ణాటక విక్టరీ.. కాంగ్రెస్‌కి మెడిసిన్‌లా మారనుందా?

బెంగళూరు ప్రాంతంలో..

–  బెంగళూరు ప్రాంతంలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. బీజేపీ 15 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
–  2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఇక్కడ బీజేపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 16 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే బీజేపీ కేవలం 11 నియోజకవర్గాల్లో, జేడీఎస్ ఒక్క నియోజకవర్గంలో విజయం సాధించాయి.

కరావళి ప్రాంతంలో ..

– కరావళి ప్రాంతంలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 12 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఆరు నియోజకవర్గాల్లో, జేడీఎస్ ఒక్క నియోజకవర్గంలో విజయం సాధించాయి.

– 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. 2018 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. బీజేపీ 16 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.

పాత మైసూరు ప్రాంతంలో ..

–  పాత మైసూరు ప్రాంతంలో 64 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 42 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ కేవలం నాలుగు స్థానాల్లోనే విజయం సాధించింది. జేడీఎస్ 16 నియోజకవర్గాల్లో, ఇతరులు రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు.

– 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 20 నియోజకవర్గాల్లో, బీజేపీ 12 నియోజకవర్గాల్లో, జేడీఎస్ 30 నియోజకవర్గాల్లో, ఇతరులు రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. ఇక్కడ జేడీఎస్, బీజేపీకి పార్టీలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో..

–  కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో మొత్తం 50 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 33 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ 16, జేడీఎస్ ఒక నియోజకవర్గంలో విజయం సాధించాయి.

– 2018 ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ 17 నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. బీజేపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. జేడీఎస్ రెండు నియోజకవర్గాల్లో, ఇతరులు ఒక నియోజకవర్గంలో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల కంటే ప్రస్తుతం ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అదనంగా విజయకేతనం ఎగురవేశారు.

కల్యాణ కర్ణాటక ప్రాంతంలో..

–  కల్యాణ కర్ణాటక ప్రాంతంలో 40 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 26 నియోజకవర్గాల్లో, బీజేపీ 10, జేడీఎస్ మూడు, ఇతరులు ఒక నియోజకవర్గాల్లో విజయం సాధించారు.

– 2018లో ఇక్కడ కాంగ్రెస్ 21 నియోజకవర్గాల్లో, బీజేపీ 15 నియోజకవర్గాల్లో, జేడీఎస్ నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. గత ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ ఐదు నియోజకవర్గాల్లో అదనంగా పాగా వేసింది.

మధ్య కర్ణాటక ప్రాంతంలో..

– మధ్య కర్ణాటక ప్రాంతంలో మొత్తం 23 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 13 నియోజకవర్గాల్లో, బీజేపీ 8, జేడీఎస్, ఇతరులు ఒక్కో నియోజకవర్గాల్లో విజయం సాధించారు.

-2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 18 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఈ ప్రాంతంలో భారీగా ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 10 నియోజకవర్గాలను బీజేపీ కోల్పోవాల్సి రాగా.. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ అదనంగా పన్నెండు నియోజకవర్గాల్లో విజయం సాధించింది.