Telangana Congress: ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా?

తెలంగాణలో కాంగ్రెస్ ఇన్‌చార్జిలు ఈ పని సక్రమంగానే చేస్తున్నారా? అంటే నో.. నో.. అనే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీలో సమస్యలను చక్కదిద్దాల్సిన అధిష్టానం దూతలు అసలు ఏం చేస్తున్నారు?

how telangana congress party incharges working

Telangana Congress Incharges: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ది సెపరేట్ సిస్టమ్.. ప్రతి రాష్ట్రానికి ఓ కార్యవర్గం.. ఆ కార్యవర్గాన్ని పర్యవేక్షించేందుకు ఇతర రాష్ట్రాల నేతలతో మరో వ్యవస్థ కాంగ్రెస్‌లో ప్రతి చోటా ఉంటుంది.. ఆ వ్యవస్థ పేరే ఏఐసీసీ ఇన్‌చార్జిలు.. రాష్ట్ర నాయకత్వం చక్కదిద్దలేని.. సమన్వయం చేయలేని అంశాలతోపాటు జాతీయస్థాయిలో డీల్ చేయాల్సిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకురావడం.. అధిష్టానం ఆలోచనలను రాష్ట్ర నేతలకు చేరవేయడం ఈ ఇన్‌చార్జిల విధి.. మరి తెలంగాణలో కాంగ్రెస్ ఇన్‌చార్జిలు ఈ పని సక్రమంగానే చేస్తున్నారా? అంటే నో.. నో.. అనే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీలో సమస్యలను చక్కదిద్దాల్సిన అధిష్టానం దూతలు అసలు ఏం చేస్తున్నారు? తమ బాధ్యతలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? కాంగ్రెస్ ఇన్‌చార్జీల తెరవెనుక రాజకీయం ఏంటి..?

కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ఇన్‌చార్జి వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది.. పార్టీ హైకమాండ్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జులే రాష్ట్రాల్లో కళ్లూ.. చెవులు.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోడానికి ఇన్‌చార్జులపైనే నమ్మకం పెట్టుకుంటుంటుంది కాంగ్రెస్ హైకమాండ్.. కానీ, తెలంగాణలో ఈ వ్యవస్థపై క్యాడర్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు మరో ముగ్గురు పార్టీ సెక్రటరీలు రాష్ట్ర పార్టీలో ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఠాక్రే ఆధ్వర్యంలో ఈ ముగ్గురు జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాల్సివుండగా.. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెద్దగా ఆ పని చేసిన దాఖలాలు లేవంటున్నారు కాంగ్రెస్ నేతలు.. మరి రాష్ట్రంలో ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న నేతలు ఏం చేస్తున్నట్లు? జిల్లా రాజకీయాలను పట్టించుకోని ఏఐసీసీ ఇన్‌చార్జిలు హైకమాండ్‌కు ఎలాంటి నివేదికలు సమర్పిస్తున్నారనే విషయమై కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది.

ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలో అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ల ఆశతో కొత్తవారు పార్టీలో చేరితే.. ఉన్నవారు అసంతృప్తితో బయటకు పోతున్నారు. రాజకీయ పార్టీల్లో ఇలాంటి వలసలు అత్యంత సహజమైనా.. వెళ్లిపోతున్న నాయకులను బుజ్జగించి.. వారు పార్టీ గేటు దాటకుండా అడ్డుకోవాల్సిన ఇన్‌చార్జులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో అసంతృప్తులు మరింత పెరుగుతున్నాయని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. దీనికి ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇటీవల జరిగిన పరిణామాలను ఉదహరిస్తున్నారు.. బీఆర్ఎస్ అసంతృప్త నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావును పార్టీలో చేర్చుకునేందుకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్.

నేతలను కాపాడుకోలేకపోవడం బలహీనతే
రాష్ట్ర నాయకత్వంతోపాటు అధిష్టానం కూడా వీరి చేరికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. కానీ, ఇదే సమయంలో పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని అసలు సంప్రదించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. పార్టీ పెద్దలు ఎవరూ తమకు కనీస గౌరవం ఇవ్వలేదన్న వేదన ఆ ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కారణమైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో కొందరు నేతలు చేరితే బలం పుంజుకున్నామని అనుకుంటే.. ఉన్న నేతలను కాపాడుకోలేకపోవడం బలహీనతే అంటున్నారు కాంగ్రెస్ లాయలిస్టులు.

Also Read: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకి కలిపి 36 సీట్లు వస్తాయి.. కాంగ్రెస్‌కేమో..: రేవంత్ రెడ్డి

ఇతర కార్యక్రమాల్లో ఇన్‌చార్జులు బిజీ
ఈ పరిస్థితి అంతటికీ ఇన్‌చార్జిలు సమర్థంగా పనిచేయకపోవడమే కారణమంటూ విశ్లేషిస్తున్నారు కొందరు సీనియర్ నేతలు.. ముఖ్యంగా అధిష్టానం దూతలుగా.. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఇన్‌చార్జ్, సహా ఇన్‌చార్జులు తమ అసలు విధులు వదిలేసి ఇతర కార్యక్రమాల్లో బిజీ అయిపోయారనే విమర్శలు గాంధీభవన్ లో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఏఐసీసీ ఇన్‌చార్జిగా మాణిక్ రావు ఠాక్రే వ్యవహరిస్తుండగా, సహ ఇన్‌చార్జులుగా రోహిత్ చౌదురి, మన్సూర్ అలీఖాన్, విశ్వనాథ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also Read: ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టడంతో.. టెన్షన్ పడుతున్న ఎంపీ దయాకర్‌!

మాణిక్‌రావ్ ఠాక్రే మొత్తం పార్టీ వ్యవహారాలను చూస్తుండగా, సహ ఇన్‌చార్జిలుగా ఉన్న ముగ్గురికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు రోహిత్ చౌదురి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు విశ్వనాథ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మన్సూర్ అలీఖాన్ ఇన్‌చార్జులుగా పనిచేస్తున్నారు. ఐతే ఈ ముగ్గురు రాష్ట్రంలో ఎక్కువగా కనిపించరనే టాక్ ఉంది. రోహిత్ చౌదరి తనకు కేటాయించిన జిల్లాలకు చుట్టపుచూపుగా వెళ్లడం తప్ప.. పార్టీ సమన్వయానికి తీసుకున్న చర్యలు శూన్యమంటున్నారు. ఈయన ఎక్కువగా ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే వెనకే ఉండటానికి ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా విశ్వనాథ 
ఇక విశ్వనాథ కేరళ ఎమ్మెల్యే. దీంతో ఆయన తన సొంత నియోజకవర్గానికి, రాష్ట్రానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇక మన్సూర్ అలీఖాన్ సైతం.. స్థానికంగా అందుబాటులో ఉండటం లేదంటున్నారు. అదే సమయంలో మాణిక్కం ఠాకూర్ పై విమర్శలు ఆరోపణలతో ఆయన స్థానంలో రంగంలోకి దిగిన మాణిక్ రావు ఠాక్రే సైతం పార్టీ సమన్వయం కన్నా.. ఇతరత్రా వ్యవహారాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కత్తిమీద సాములా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. అభ్యర్థుల జాబితా వెల్లడైన తర్వాత నేతలను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదనే టాక్ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు