telangana farmers: దంచికొడుతున్న వర్షాలు రైతన్నను దారుణంగా ముంచేశాయి. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆది(అక్టోబర్ 11,2020) , సోమవారాల్లో(అక్టోబర్ 12,2020) కురిసిన వర్షాలకు రోజుకు లక్ష ఎకరాల చొప్పున 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం కలిగింది. ఇక మంగళవారం(అక్టోబర్ 13,2020) ఒక్కరోజే ఏకంగా 3 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి.
30-40 శాతం విస్తీర్ణంలో దెబ్బతిన్న పత్తి పంట:
చేతికొచ్చే దశలో పంటలు దెబ్బ తినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా పత్తి పంట రాష్ట్రంలో 60.22 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. 30-40 శాతం విస్తీర్ణంలో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పత్తి కాయలు కొంత మేరకు తెరుచుకొని, వాన నీళ్లతో మురిగిపోతున్నాయి. ఇది దిగుబడిపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. వరద ఉధృతికి పంటచేలల్లో భూమి కోతకు గురవుతోంది. మొక్కలు కొట్టుకుపోతున్నాయి. వరద ధాటికి ఎన్నోచోట్ల పంటకు పంటే కొట్టుకుపోయింది.
వరి పంట నిలవడం కష్టమని రైతులు తీవ్ర ఆందోళన:
వరికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈసారి రైతులు దొడ్డు రకాల కంటే సన్న రకాలే ఎక్కువగా సాగు చేశారు. మొత్తం వరి పంట 52.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఇందులో 39.58 లక్షల ఎకరాల్లో సన్నాలు వేశారు. ఇంత భారీ వర్షాలకు సన్నాలు తట్టుకోవని, పంట నిలవడం కష్టమని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్ద:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బోధన్, చందూరు, వర్ని, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు వరి కోయకుండా వదిలేయడంతో నేలకొరిగింది. కామారెడ్డి జిల్లాలో చేతికొచ్చిన ధాన్యం నీటి పాలైంది. ఎల్లారెడ్డి, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో వరి కోతలు కోయడంతో కల్లాల్లోనే ధాన్యం తడిసిపోయింది.
వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పత్తి ఏరడానికి, ఆరబెట్టడానికి వీలు లేకుండా పోయింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి పంట చేతికొచ్చే దశలో చేలలోనే తడిసిపోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మహబూబాబాద్ జిల్లాలో నేలవాలిన వరి పొలాలు:
మహబూబాబాద్ జిల్లాలో వరి పొలాలు నేలవాలాయి. పత్తి చేలు ఎర్రబడి కాయలు నల్లబారాయి. మిర్చి తోటల్లో సైతం నీరు నిలిచింది. ఇటు ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క కల్లూరు మండలంలోనే 20వేల ఎకరాల్లో వరిపంట దెబ్బతినగా సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
తీవ్రంగా నష్టపోయిన నల్లగొండ జిల్లా రైతులు:
నల్లగొండ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి చేలలో గూడ రాలిపోవడంతోపాటు ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసి ముద్దయ్యింది. నల్లరేగడి నేలలు జాలుపట్టి దిగుబడి సగానికి సగం తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. వరి చేలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికే ఐకేపీ కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కూరగాయ పంటలకు ఎక్కువ నష్టం కలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కోత దశలో ఉన్న వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా తెలంగాణవ్యాప్తంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే చావే దిక్కంటున్నారు. లక్షలకు లక్షలు అప్పుచేసి సాగుచేసిన పంట… నీళ్లపాలు కావడంతో లబోదిబోమంటున్నారు.