×
Ad

Musi River: మూసీకి మరోసారి వరద ముప్పు.. భారీగా నీటి విడుదల.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Musi River: మూసీ నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. మరోసారి భారీ వర్షం హెచ్చరిక ఉండటంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ఉండే అన్ని జిల్లాలు మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి.. వీటి పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కొంత అప్రమత్తం అయ్యారు. గతంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాల కారణంగా అప్పటికే నిండుకుండల్లా ఉన్న హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి భారీగా వరద నీరు కిందకు వచ్చింది. గడిచిన ఐదు, పదేళ్లలో ఎప్పుడూ రానటువంటి వరద కిందకు రావడంతో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షం వచ్చినప్పుడు ఒక్కసారిగా వరద నీరు వస్తే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అలర్ట్ అయిన అధికారులు నీటిని కిందకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ నుంచి 2వేల క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్ నుంచి 3వేల క్యూసెక్కులు.. మొత్తం 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. హైదరాబాద్ నగరంలోని పురానాపూల్, చాదర్ ఘాట్, మూసారంబాగ్ ఏరియాల్లో మూసీ ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాల్లోని పబ్లిక్ ను అధికారులు అప్రమత్తం చేశారు.

గడిచిన వారంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకున్నారు. కొంత ముందస్తుగానే నీటిని కిందికి వదులుతున్నారు. మరో నెల రోజులు వానలు కురిసే అవకాశం ఉందని, ఈ రిజర్వాయర్లను మళ్లీ వర్షం నీటితో నింపే అవకాశం ఉంది. పైనుంచి ఉస్మాన్ సాగర్ కు 400 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ కు 200 క్యూసెక్కులే వస్తోంది. అయినప్పటికీ వేల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో వాటర్ ను బ్యాలెన్స్ చేసే విధంగా హైదరాబాద్ జల మండలి అధికారులు ప్రణాళిక రూపొందించుకుని ఆ ప్రకారం ముందుకెళ్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎక్కడెక్కడ మూసీ నీరు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లోని పబ్లిక్ ను కొంత అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. భారీగా వరద నీరు వస్తే మాత్రం వారంతా ఇళ్ల ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా అవసరమైన చర్యలను జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ విభాగాలు తీసుకుంటున్నాయి.

Also Read: ముంచుకొస్తున్న తుపాను గండం.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. కుండపోత వర్షాలకు చాన్స్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..