Hussainsagar Waves hyderabad Kishan Reddy Laser Light
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ‘కోహినూర్’ వజ్రం గురించిన కథను కూడా వివరించనున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రాంతంలో మొదలైన కోహినూర్ కథ.. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసి ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ప్రముఖ రచయిత ఎస్ఎస్ కంచి రాశారు. ప్రముఖ నేపథ్య గాయని (ప్లే బ్యాక్ సింగర్) సునీత గాత్రాన్ని అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. కానీ.. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. కోహినూర్ కథతోపాటుగా.. తెలంగాణ కథ, ఇక్కడి సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనుంది.
800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీన్ని కూడా కేంద్రమంత్రి ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు:
రొబోటిక్ నాజిల్స్ అండ్ లైటింగ్ : వెయ్యికి పైగా రొబోటిక్ నాజిల్స్, DMX ప్రొటోకాల్ తో కూడిన అడ్వాన్స్‌డ్ అండర్ వాటర్ లైటింగ్ సిస్టమ్స్ ద్వారా రంగు రంగుల లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
లేజర్ టెక్నాలజీ : ఆకర్షణీయమైన లేజర్ రంగుల కోసం మూడు 40W RGB లేజర్స్ ను ఏర్పాటుచేశారు.
గ్యాలరీ, రూఫ్ టాప్ రెస్టారెంట్ : 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ గ్యాలరీ, సంజీవయ్య పార్క్, మల్టీ మీడియా షోను పనోరమిక్ వ్యూ కోసం రూఫ్ టాప్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.
HD ప్రొజెక్షన్ : ఒక్కొక్కటి 34వేల ల్యుమెన్స్ సామర్థ్యం గల 3 HD ప్రొజెక్టర్స్ ద్వారా వాటర్ స్క్రీన్ పై స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రొజెక్షన్ ఉండేలా ఏర్పాట్లున్నాయి. బీమ్ మూవింగ్ హెడ్‌లైట్స్ ద్వారా విజువల్ ఎఫెక్ట్ అందంగా ఉండనుంది.
కథాపరమైన వర్ణణ : కోహినూర్ వజ్రానికి సంబంధించన కథ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్ర్య సంగ్రామం వంటి ఘట్టాలను సాగర్ అలలపై అందమైన లైటింగ్ ప్రొజెక్షన్ ద్వారా పర్యాటకులను ఆకట్టుకునేలా వివరిస్తారు. దీనికితోడు 5.1 డాల్బీ స్టయిల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆడియో ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా స్పష్టంగా ఉండబోతోంది.
రికార్డ్-బ్రేకింగ్ వాటర్ ఫౌంటేన్: 260 అడుగుల ఎత్తు, 540×130 డైమెన్షన్ తో దేశంలోనే అతిపెద్ద, అతి ఎత్తయిన వాటర్ ఫౌంటేన్ ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నాయి.
చారిత్రక ప్రాధాన్యత: స్టోరీ టెల్లింగ్ (కథను వివరించే విషయంలో) విషయంలో, చారిత్రక ఘట్టాలకు సరైన ప్రాధాన్యత విషయంలో సాంకేతిక సృజనాత్మకత కు పెద్దపీట వేశారు.