Huzurabad Vacancy Notice : హుజురాబాద్ స్థానం ఖాళీ.. ఉపఎన్నికపై గులాబీ-కమలం కసరత్తు..!

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ స్థానం ఖాళీ అయింది. తాజాగా హుజారాబాద్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది.

Huzurabad Assembly Constituency Vacancy Notice Release : తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ స్థానం ఖాళీ అయింది. తాజాగా హుజారాబాద్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 12, 2021న హుజారాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు. తన రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి లేఖను సమర్పించారు. ఈటల రాజీనామా లేఖను పరిశీలించిన స్పీకర్ పోచారం ఆమోదించారు. ఈటల రాజీనామాను ఆమోదించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి అసెంబ్లీ కార్యదర్శి సమాచారం ఇచ్చింది. కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు.

ఈటల రాజీనామాతో హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కొన్ని ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏకచత్రాధిపత్యం చేసిన ఈటల రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటెల త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం ఈటల తన అనుచరుతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన బీజేపీలో జాతీయ నాయకుల సమక్షంలో ఈటల చేరనున్నారు.

శామీర్‌పేటలోని నివాస గృహానికి బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులంతా వచ్చి ఈటలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతోపాటు జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కూడా బీజేపీలో చేరనున్నారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించిన తర్వాత ఆరు నెలల్లోపు ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు.. ఈటలను హుజూరాబాద్‌లో ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ రోడ్‌మ్యాప్‌ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో పావులు కదుపుతున్నట్టు సమాచారం.

ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరనున్నడటంతో ఆ పార్టీ కూడా హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈటల బీజేపీ చేరిక అనంతరం హుజారాబాద్‌లో కమలదళం రంగంలోకి దిగనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను రంగంలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో మండలాల వారీగా బీజేపీ ఇన్‌చార్జీలను నియమించినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు