Sha Phone
Huzurabad BY Poll 2021 : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆయన ఫోన్ చేసి వివరాలను అడగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించబోతోందని షాకు వివరించారు బండి సంజయ్. ఈ సందర్భంగా…పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి షా అభినందనలు తెలిపారు. జూన్ 12న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో హుజూరాబాద్ లో బై పోల్ జరిగింది. ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Read More : Himachal By Poll Results : బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్ క్లీన్ స్వీప్
అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 84 శాతం పైగా పోలింగ్ నమోదవగా ఈ సారి అది 86.57 శాతానికి పెరిగింది. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం కౌంటింగ్ కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించారు. ఈ ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆధిక్యం కనబరిచారు. అనంతరం ఈవీఎంలను లెక్కించారు. ప్రతి రౌండ్ లో ఈటల ఆధిక్యం కనబరిచారు. కొద్దిగా వెనుకబడినా తర్వాతి రౌండ్ లో పుంజుకున్నారు. మొత్తం 22 రౌండ్లు ఉండగా…14వ రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి 1046 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 9 వేల 434 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. తమదే విజయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.