Hyderabad Airport After Inhaling Gas, Plumber Died
Hyderabad Airport After Inhaling Gas : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం చోటుచేసుకుంది. ప్లంబింగ్ పనులు చేస్తుండగా డ్రైనేజీ పైప్ లైన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో లీకైన విషవాయువును పీల్చి ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి అస్వస్థతగా ఉన్నట్టు తెలుస్తోంది. పైప్ లైన్ లీకేజీ కావడంతో దాన్ని సరిచేసేందుకు కార్మిక సిబ్బంది వెళ్లారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ సమీపంలోని భవనంలో డ్రైనేజీ పైపులో లీకేజీ ఏర్పడింది.
దాంతో ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ప్లంబర్లు నరసింహారెడ్డి(42), మరో ఇద్దరు జకీర్, ఇలియాస్ సరిచేసేందుకు వెళ్లారు. డ్రైనేజీ లీకేజీని సరిచేసేందుకు ప్రయత్నించారు. లీకేజీ భవనం పైఅంతస్తులో పైపు వద్దకు నిచ్చెన సాయంతో ఎక్కారు.. అందులో ఫాల్స్ సీలింగ్ కొంతభాగం తొలగించారు. అనంతరం పైపులో యాసిడ్ పోశారు. డ్రైనేజీ పైపు నుంచి ఘాటైన గ్యాస్ లీక్ అయింది. ఒక్కసారిగా ఘాటైన విషవాయువులు, పొగలు వచ్చాయి.
దాంతో నరసింహారెడ్డికి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. జకీర్, ఇలియాస్‌లు స్పృహా కోల్పోయారు. అప్రమత్తమైన అధికారులు వారిని ఎయిర్‌పోర్టులోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి మృతిచెందగా.. జాకీర్, ఇలియాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.