Old Currency Notes : వామ్మో.. హైదరాబాద్‌లో రద్దయిన పాత నోట్ల కలకలం.. రూ.55లక్షల విలువైన కరెన్సీ నోట్లు స్వాధీనం..

ఈ నోట్లను ప్రభుత్వం రద్దు చేసి కొన్నేళ్లు గడుస్తోంది. అయినప్పటికీ.. కొంతమంది అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నోట్ల మార్పిడి చేస్తున్నట్లుగా గుర్తించారు.

Old Currency Notes : హైదరాబాద్ లో రద్దయిన పాత నోట్లు కలకలం రేపాయి. తాజ్ మహల్ హోటల్ వద్ద రద్దయిన పాత కరెన్సీ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ హుస్సేన్, అంజద్ ఖాన్, భాస్కర్, షేక్ నసీమాలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 55.50 లక్షలు విలువ చేసే రద్దయిన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో పాత 500, 1000 రూపాయల నోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులు 10శాతం కమిషన్ తో పాత నోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇస్తున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్ నగరంలో పాత నోట్లు మార్పిడి చేస్తామంటూ ఓ ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్ లో అతడిని విచారించారు. అతడు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

భారత ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్పు చేస్తామని, అందుకుగాను తమకు 10శాతం కమిషన్ ఇవ్వాలని ముఠా సభ్యులు చెబుతారు. ఈ ముఠా నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమారుగా 55.50 లక్షల విలువైన రద్దైన కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా వెయ్యి, 500 రూపాయలు నోట్లు ఉన్నాయి.

Also Read : నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 59 మంది మృతి, 150 మందికిపైగా గాయాలు..

ఈ నోట్లను ప్రభుత్వం రద్దు చేసి కొన్నేళ్లు గడుస్తోంది. అయినప్పటికీ.. కొంతమంది అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నోట్ల మార్పిడి చేస్తున్నట్లుగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. వీళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? పాత నోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్లు ఎప్పటి నుంచి ఈ దందా నడిపిస్తున్నారు? దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుల వద్ద రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు 4338, 500 నోట్లు 2429 ఉన్నాయి. మొత్తం 55,52,500 రూపాయలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. ఈ నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి కొంత గడువు కూడా ఇచ్చింది. ఆర్బీఐ చట్టం ప్రకారం రద్దయిన నోట్లను కలిగి ఉండటం నేరం. చట్ట నిబంధనల ప్రకారం ఆయా వ్యక్తులు శిక్షకు అర్హులు.

పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ కరెన్సీ బయటకు వచ్చింది. చాలామంది తమ దగ్గరున్న పెద్ద నోట్లను (రూ.500, రూ.1000) బ్యాంకుల్లో మార్చుకున్నారు. పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లను తీసుకున్నారు. అయితే కొందరు మాత్రం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందనే భయంతో పాత నోట్లను మార్చుకోలేదు. అప్పుడప్పుడు ఆ కరెన్సీ బయటపడుతోంది. వాటిని మార్పిడి చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.