గ్రేటర్ ఎన్నికలు : బాధ్యత ఉండక్కర్లా ? సొంతూళ్లకు చెక్కేసిన జనాలు

Hyderabad Citizens Leaving To Villages In Election Holiday Time

Hyderabad Citizens Leaving : రోడ్డు బాగాలేకపోతే మేయర్‌ను తిడుతాం.. మ్యాన్‌హోల్‌ ఓపెన్‌ ఉంటే కార్పొరేటర్‌ను కడిగిపారేస్తాం. మరి మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందా? లేదా..? వరుసగా సెలవులు వచ్చాయని.. ఉద్యోగులు, విద్యావంతులు ఓటేయకుండా సొంతూళ్లకు చెక్కేస్తే ఎలా? బాధ్యత ఉండక్కర్లా?



ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఓటేయడం తప్పన్నట్టు బిహేవ్‌ చేస్తారు కొందరు ప్రజలు. ఓటేసేందుకు సెలవిస్తూ.. సేదతీరుతామని టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్తారు. ఇప్పుడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సిటీజనం పట్నం వీడుతున్నారు. కొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్తే.. ఇంకొందరు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఆదివారం, సోమవారం సెలవులు వచ్చాయి. ఇక పోలింగ్‌ డే రోజు కూడా సెలవే కావడంతో మూడు రోజులు కలిసి వస్తాయని ఓటింగ్‌ మీద ఆసక్తి లేనివారు వెళ్లిపోతున్నారు.



సెలవుల వల్ల ఎల్బీనగర్‌ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ వైపు వెళ్లే వెహికిల్స్‌ ప్రయాణికులతో నిండిపోయాయి. బుధవారం నుంచి పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటంతో అంతా ఊరిబాట పట్టారు. వీరిలో కొందరు పోలింగ్ రోజు తిరిగివస్తామని గల్లీ లీడర్లకు హామీ ఇచ్చారట. అయితే సెలవుల ఎఫెక్ట్ పోలింగ్ మీద పడుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.