ఆర్థిక సాయం ఏదీ ? రోడ్డెక్కిన వరద బాధితులు, ఆదుకుంటామన్న కేటీఆర్

  • Publish Date - November 1, 2020 / 07:22 AM IST

Hyderabad flood victims Protests : వరద సాయం విషయంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగారు. సగమే డబ్బులు ఇచ్చారంటూ కొందరు…రూపాయీ కూడా ఇవ్వలేదంటూ మరికొందరు…ధర్నాలు చేపట్టారు. మరి ఈ వరద సాయం నిలిపివేత తాత్కాలికమా..లేదంటే పూర్తిగా వరద సాయం ఆగిపోనుందా..? హైదరాబాద్ నగరంలో వరద సాయం పంపిణీ నిలిపివేతతో బాధితులు రొడ్డేక్కారు.



ధర్నాలు, నిరసనలు : – 
జీహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల వద్ద ధార్నాలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యేలు, కార్పోరేటర్ల ఇంటి వద్ద నిరసనలు తెలిపారు. ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో ధర్నా నిర్వహించిన బాధితులు..తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. నష్టపోయిన ప్రతి ఇంటికి రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని సర్కిళ్లలో దాదాపు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద 10వేల ఆర్థిక సహాయాన్ని అందించింది.



3 లక్షల 25 వేల మందికి ఆర్థిక సాయం : – 
గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు 3లక్షల 25వేల మంది కుటుంబాలకు పైగా 10వేల ఆర్థిక సాయం అందజేసినట్లు చెబుతున్నాయి బల్దియా వర్గాలు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు పరిహారం అందలేదని..,మరిన్ని ప్రాంతాల్లో అధికారులు, స్థానిక నేతలు 10వేల ఆర్థిక సాయంలో కొంత మాత్రమే చెల్లించారన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే తమ పేరు నమోదు చేసుకుని OTP కూడా తీసుకుని ఒక్క రూపాయీ ఇవ్వలేదని అంటున్నారు.



ఆందోళనలు : – 
వరద సాయం ఆగిపోవడంతో ఆగ్రహానికి గురైన బాధితులు…ఆందోళనలకు దిగారు. సైదాబాద్ ప్రధాన రోడ్డుపైకి తరలివచ్చి ధర్నా నిర్వహించారు. అలాగే అంబర్ పేట్ ఎమ్మెల్యే వెంకటేశ్‌ ఇంటి వద్ద, అంబర్ పేట్ కార్పోరేటర్ పులి జగన్ ఇల్లు, చందానగర్ కార్పోరేటర్ నవతరెడ్డి ఇల్లు, హిమాయత్ నగర్ కార్పోరేటర్ కార్యాలయం వద్ద, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, కాప్రా కార్పోరేటర్, అజంపూరం డివిజన్, హస్తినాపురం డివిజన్, ముసారం బాగ్ బ్రిడ్జి వద్ద, కొత్తపేట్ ప్రధాన రహదారి వద్ద గడ్డి అన్నారం డివిజన్ వాసులు, అడ్డగుట్ట కార్పొరేటర్ ఇలా ప్రజా ప్రతినిధుల ఇల్లు, కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.



అధికారులకు నిరసన సెగ : – 
అటు జిహెచ్ఎంసి అధికారులకు కూడా నిరసన సెగ తగిలింది. జోనల్ మరియు డిప్యూటి కమీషనర్ కార్యాలయాల వద్ద పలు ప్రాంతాల్లో ధార్నాలు నిర్వహించారు. దాంతో అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఆధార్ కార్డులు పరిశీలించిన అధికారులు…సాయం అందేలా చేస్తామని చెప్పి తిప్పి పంపించేశారు. అయితే ప్రభుత్వం లాగిన్‌ నిలిపివేయడం వల్లే డబ్బు పంపిణీ చేయడం లేదని అంటున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. మరి ఈ నిలిపివేత తాత్కాలికమా..లేదంటే పూర్తిగా వరద సాయం ఆగిపోనుందా..అన్నది చూడాలి.



మంత్రి కేటీఆర్ హామీ : – 
హైదరాబాద్‌ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారందరికీ ఆర్థిక సహాయం అందించామని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే పలు ప్రాంతాల నుంచి తమకు ఇంకా ఆర్థిక సహాయం అందలేదని కొంతమంది చేస్తున్న విజ్ఞప్తులు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సహాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నం అన్నారు.



ఆందోళన వద్దు : –
అర్హులైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందకుంటే, మరి కొద్ది రోజుల పాటు వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. వరదల్లో నష్టపోయిన ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో, హైదరాబాద్ జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.