Hyderabad వాసులు జాగ్రత్త, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

  • Publish Date - September 19, 2020 / 02:40 PM IST

Director EV&DM, GHMC : హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తుతోంది. 2020, సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభమైంది. భారీగా ఉరుముల శబ్దాలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.



చీకటి వాతావరణం ఏర్పడింది. వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్థంభించిపోయింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారులపై భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రజలకు పలు సూచనలు చేసింది. నగరంలో భారీ వర్షం కురుస్తుందని, ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచనలు జారీ చేసింది. ప్రమాదం ఏర్పడితే..040-2955500 (DRF)ను సంప్రదించాలని సూచించింది.



మొన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. భారీగా వరద నీరు పోటెత్తడంతో వాహనాలు కొట్టుకపోయాయి. అపార్ట్ మెంట్స్ సెల్లార్ లోకి నీరు చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగిపోయాయి. పలు ప్రమాదాలు కూడా ఏర్పడ్డాయి.



మల్కాజిగిరి నేరెడ్ మెట్ లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే సుమేధ (11) నాలాలో పడి చనిపోయింది. నాలా తెరిచి ఉండడంతో గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమేధ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.