Jeedimetla
Hyderabad: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్నకుమార్తె తన ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా అంటూ ప్రియుడిని యువతి బెదిరించింది. దీంతో అతడు తన తమ్ముడితో కలిసి ప్రియురాలి ఇంటికొచ్చాడు. కుర్చీపై ఉన్న ఆమె తల్లిని బలంగా తన్నడంతో కిందపడిపోయింది.. ఆ వెంటనే కూతురు చున్నీని తీసుకొని తల్లి మెడకు బిగించింది. ముక్కులో నుంచి రక్తస్రావం కావడంతో చనిపోయిందని భావించారు. దీంతో ఆమె ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, కొద్దిసేపటికే తల్లిలో కదలికను గమనించిన కూతురు.. మళ్లీ ప్రియుడికి ఫోన్ చేసి వెంటనే రావాలని చెప్పింది.. ఆ తరువాత అసలు డ్రామాను మొదలు పెట్టింది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39)కి 16ఏళ్ల క్రితం దమ్మన్నపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి కూతురు (15) ఉంది. 13ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో అంజలి కుప్పంకు చెందిన రవి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. వారికి మనస్విని (12) కుమార్తె ఉంది. అయితే, గత సంవత్సరం క్రితం రవి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో కళాకారిణిగా పనిచేస్తుంది. ఇద్దరు కుమార్తెలతో మూడునెలలుగా షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటోంది.
పెద్ద కుమార్తె టెన్త్ క్లాస్ చదువుతుంది.. నల్గొండ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఆ తరువాత వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో చెప్పడంతో అంజలి కుమార్తెను మందలించింది. పెళ్లికి నిరాకరించింది. తల్లి బతికిఉంటే శివను పెళ్లిచేసుకోవటం సాధ్యంకాదని భావించిన కుమార్తె.. శివతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో తల్లి అంజలి జీడిమెంట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, కుమార్తె మళ్లీ ఇంటికి వచ్చింది. తల్లి అంజలిని చంపితేనే శివతో పెళ్లి సాధ్యమవుతుందని భావించిన కుమార్తె.. శివకు ఫోన్ చేసి మా అమ్మను చంపేద్దామని చెప్పింది.
పథకం ప్రకారం.. శివ తన తమ్ముడితో కలిసి ప్రియురాలి ఇంటికి వచ్చాడు.. అంజలి కుర్చీలో కూర్చొని ఉండగా బలంగా తన్నడంతో ఆమె కిందపడి తలకు గాయమైంది. ఆ వెంటనే అంజలి మెడకు కుమార్తె చున్నీ బిగించింది. ఆమె ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో చనిపోయిందని భావించారు. అయితే, కొద్దిసేపటికి అంజలిలో కదలిక వచ్చింది. వెంటనే శివకు ఫోన్ చేసి చెప్పడంతో.. మళ్లీ శివ వచ్చి ప్రియురాలితో కలిసి అంజలిని చంపేశాడు.
ఆ సమయంలోనే నిందితురాలి చెల్లెలు పాఠశాల నుంచి ఇంటికొచ్చింది. తన చెల్లెలిని ఏమార్చి పక్కింటికి పంపించింది. తల్లి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయిందంటూ బంధువులకు నిందితురాలు ఫోన్ చేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అనుమానం వచ్చింది. ఆమె గాయాలతో చనిపోయిందని గుర్తించి.. బాలికను గట్టిగా మందలించారు. దీంతో తన ప్రియుడు శివ, అతడి సోదరుడితో కలిసి తల్లిని హత్య చేయించినట్లు అంగీకరించింది. దీంతో నిందితులు ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.