×
Ad

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు ఎనిమిదేళ్లు.. సురక్షితమైన ప్రయాణంతో నిరంతరాయంగా సేవలు.. త్వరలో రాబోతున్న రూట్లు ఇవే..

Hyderabad Metro నగర ప్రజల నుంచి విశేష ఆదరణ చూరగొంటున్న మెట్రో రైలు రవాణాను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

Metro

Hyderabad Metro : మెట్రో రైల్.. ఈ పేరు వినగానే ప్రయాణికుల్లో కొంత సంతోషం, ఊరట కనిపిస్తుంది.. ఎందుకంటే.. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది.. రహదారులపై వాహనాల రద్దీ పెరుగుతోంది.. ఈ క్రమంలో నగరంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రహదారులపై ప్రయాణం చేయాలంటే చాలా సమయం పడుతుంది. అదే మెట్రో ఎక్కితే.. సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణంతోపాటు.. తక్కువ సమయంలోనే గమ్య స్థానానికి చేరుకోవచ్చు. దీంతో గత ఎనిమిదేళ్లుగా నగర ప్రజలు మెట్రోను అమితంగా ఆదరిస్తున్నారు. నగర వాసులను అలరిస్తున్న మెట్రో రైళ్లు.. వేగవంతమైన ప్రయాణ సౌకర్యంతో నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. నగర ప్రజలకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందిస్తున్న మెట్రోకు నేటితో ఎనిమిదేళ్లు.. ఈ క్రమంలో అసలు మెట్రో ఎప్పుడు మొదలైంది.. రోజుకు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఇంకా ఏఏ రూట్లలో మెట్రో సేవలు (Hyderabad Metro) అందుబాటులోకి రాబోతున్నాయనే వివరాలను ఓసారి పరిశీలిద్దాం..


నగరంలో ట్రాఫిక్ రహితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో 2012లో ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) మోడల్ లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టింది. రెడ్ లైన్ (ఎల్బీ నగర్-మియాపూర్), బ్లూ లైన్ (నాగోల్-రాయదుర్గం), గ్రీన్ లైన్ (జేబీఎస్-ఎంజీబీఎస్) వంటి మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.

హైదరాబాద్‌ మెట్రోరైల్‌ 2017 నవంబర్‌ 28వ తేదీన పట్టాలెక్కింది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రధాని మోదీ తొలి సర్వీస్ ను ప్రారంభించారు. ఇది మియాపూర్‌ నుంచి అమీర్‌పేట్‌ వరకు రాకపోకలు సాగించింది. ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నిర్విరామంగా మెట్రోరైళ్లు నగర ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో మొత్తం 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. రోజుకు 1,100 ట్రిప్పులు మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి.ప్రతిరోజూ 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ఈ రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. అయితే.. నగరంలో పెరిగిన రద్దీ నేపథ్యంలో ఈ మెట్రో రైళ్ల సేవలను ఇంకా విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది.


మెట్రోలో ప్రయాణించే రోజువారీ ప్రయాణికుల్లో ఉద్యోగులే ఎక్కువ మంది. దాదాపు 51.5శాతం మంది ఉద్యోగులు మెట్రోలో ప్రయాణిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు ఇటీవల ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ట్విటర్‌ (ఎక్స్‌)లో నిర్వహించిన పోల్‌ ద్వారా వెల్లడించింది. 2017 నవంబర్ 29 నుండి ఈ ఏడాది నవంబర్ 26 వరకు సుమారు 80.21 కోట్ల మంది మెట్రో ప్రయాణించినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్యే హైదరాబాద్ మెట్రో సేవలకు ఉన్న ప్రజాదరణను స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలో మెట్రో సంస్థ అనేక అవార్డులను అందుకుంది.

నగర ప్రజల నుంచి విశేష ఆదరణ చూరగొంటున్న మెట్రో రైలు రవాణాను మరింత విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో మొత్తం ఎనిమిది కారిడార్లలో 163 కిలోమీటర్లను రూ.43,848కోట్ల వ్యయంతో ప్రతిపాదించారు. వీటికి సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే వీటికి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండో దశ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో మెట్రోకు మరింత కీర్తి లభించనుంది.

రాబోయే రూట్స్ ఇవే..
హైదరాబాద్ మెట్రో రెండవ దశలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మెట్రోలైన్ ప్రతిపాదించారు. ఎయిర్ పోర్టు టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండనుంది.
జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, తూంకుట మీదుగా శామీర్ పేట వరకు 22 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ రన్‌వే కారణంగా ఇక్కడ దాదాపు 1.5కిలోమీటర్ల వరకు మెట్రో‌లైన్ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లేలా డీపీఆర్‌ఓలు డిజైనే్ చేశారు.
జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయినపల్లి, కొంపల్లి మీదుగా మేడల్చ్ కు 24.5 కిలోమీటర్ల లైన్ ప్రతిపాదించారు.

అయితే, ప్రస్తుతానికి ప్రైవేటు యాజమాన్యంలో హైదరాబాద్‌ మెట్రో నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి సర్కారు చేతికి వచ్చేలా కసరత్తు జరుగుతోంది. 9వ వసంతంలో ఈ కీలక మార్పులు మెట్రోలో జరగనున్నాయి.