Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణీకులకు శుభవార్త.. అర్థరాత్రి వరకు మెట్రో సేవలు..
గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు.

Hyderabad Metro
Metro Rail In Hyderabad : హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనంకోసం సాగనంపుతున్నారు. బైబై గణేశా.. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ భక్తులు గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం వరకు ముగియనుంది. అయితే, నగరంలో రేపు ఉదయం వరకు గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో నగర వాసుల ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రయాణికులకోసం మెట్రో రైళ్లు నపడనున్నారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు. గురువారం అర్థరాత్రి 1గంట వరకు రైళ్లను హైదరాబాద్ మెట్రో నడపనుంది. రాత్రి 2గంటలకు ఆయా రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఇందుకోసం ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. డిమాండ్ ను బట్టి ఆయా మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
29న ఉదయం 6గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు కొనసాగుతాయని మెట్రో అధికారులు తెలిపారు. నగరవాసులు ప్రయాణాలకోసం మెట్రో సేవలను వినియోగించుకోవాలని కోరారు.