Union Budget 2026: 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు.. వాటిలో 3 మనకే..
హైస్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, పుణె-హైదరాబాద్ ఉన్నాయి.
Nirmala Sitharaman (Image Credit To Original Source)
- ప్రకృతిహితంగా అభివృద్ధి సాధించిన నగరాలకు ప్రాధాన్యం
- ముంబై-పుణె, ఢిల్లీ-వారణాసి మధ్య కారిడార్ల ప్రతిపాదన
- వారణాసి-సిలిగుడి, చెన్నై-బెంగళూరు మధ్య కూడా..
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు, కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, 20 జాతీయ జలమార్గాల ఆపరేషన్లను ప్రతిపాదించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, పుణె-హైదరాబాద్ ఉన్నాయి.
అలాగే, ముంబై-పుణె, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లను నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం గత ఏడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు.
ప్రకృతికి నష్టం కలగకుండా, సహజ వనరులు అధికంగా దుర్వినియోగం చేయకుండా, భవిష్యత్ తరాలు కూడా వినియోగించుకునేలా అభివృద్ధి కొనసాగించిన నగరాల్లో ప్రయాణికుల రవాణా వ్యవస్థలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు.
ఇతర రవాణా మార్గాలకు?
ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్, హైకింగ్ ఎక్స్పీరియన్స్ అందించే సామర్థ్యం, అవకాశం భారత్కు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో స్థిరమైన పర్వత మార్గాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. తూర్పు ఘాట్లలోని అరకు లోయ, పశ్చిమ ఘాట్లలోని పుడిగై మలై ప్రాంతాల్లోనూ ఈ మార్గాలు రూపొందిస్తారు.
అదనంగా వన్యప్రాణి పర్యాటకం దృష్ట్యా ప్రత్యేక మార్గాలు రూపొందిస్తారు. ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టర్టిల్ ట్రైల్స్, పులికాట్ సరస్సు చుట్టుపక్కల పక్షి వీక్షణ మార్గాలు వీటిలో ఉన్నాయి.
“తూర్పున పశ్చిమ బెంగాల్ డాంకుని నుంచి పడమరలో సూరత్ వరకూ అనుసంధానించే కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు ఏర్పాటు చేస్తాం. పర్యావరణ స్థిరత్వం ఉన్న సరుకు రవాణాను ప్రోత్సాహించే దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల్లో 20 కొత్త జాతీయ జలమార్గాల ఆపరేషన్ ప్రారంభిస్తాం” అని ఆర్థిక మంత్రి చెప్పారు.
