hyderabad metro ticket charges increase
hyderabad metro ticket charges increase : హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత భారంకానుంది. త్వరలోనే మెట్రో చార్జీలు పెరుగనున్నాయి. చార్జీలు పెంచాలనికోరుతూ హైదాబాద్ మెట్రో యాజమాన్యం కేంద్రాన్ని కోరింది. చార్జీలు పెంచటం కోసం హైదరాబాద్ మెట్రో యాజమాన్యం చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దీని కోసం ఫేర్ ఫిక్స్‌డ్ కమిటీ (ఎఫ్ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్‌ను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది. ఈక్రమంలో వెంటనే రంగంలోకి దిగిన కమిటీ ప్రస్తుతమున్న మెట్రో చార్జీల సవరణకు సంబంధించిన తమ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను నవంబరు 15లోగా తెలపాలని ప్రయాణికులను కోరింది. ఈమెయిల్ అడ్రస్ ffchmrl@gmail.com ద్వారా కానీ, చైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 అడ్రస్‌కు పోస్ట్ ద్వారా కానీ పంపాలని సూచించింది.
సాధారణంగా మెట్రో రైలు చార్జీలు పెంచే అధికారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ)కు మొదటిసారి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వాటిని సవరించే అధికారం మాత్రం కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీకే ఉంటుంది. దీంతో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కేంద్రాన్ని కోరింది. కాగా..2017 నవంబరు 28వ తేదీ నుంచి మెట్రో రైలులో ప్రస్తుతం కనిష్ఠ చార్జీ రూ. 10 కాగా, గరిష్ఠ చార్జీ 60 రూపాయలుగా ఉంది. కేంద్రం నియమించిన కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యాంప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.