HYD Metro
Hyderabad Metro Rail: మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. వారం రోజుల్లో మెట్రో రైలు చార్జీలు పెరగబోతున్నాయి. ఈ మేరకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కసరత్తు చేస్తోంది. ఈనెల 8వ తేదీన నిర్వహించబోయే సమావేశంలో మెట్రో చార్జీల పెంపుపై కీలక నిర్ణయం వెలువడుతుందని, మే 10వ తేదీ నుంచి పెంచిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే టికెట్ రేట్లు పెంచే యోచనలో మెట్రో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. మెట్రో నష్టాల్లో నడుస్తుందని, నష్టాల నుంచి బయటపడేందుకు ఛార్జీలు పెంచడమే మార్గమని మెట్రో అధికారులు భావిస్తున్నారు. కరోనా సమయంలో ఏడాదిపాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రో పై ఆర్థిక భారం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ భారం రూ.6,598కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే, కొంతకాలంగా మెట్రో చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెట్రో విజ్ఞప్తి చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పట్లో మెట్రో చార్జీలను పెంచేది లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో మెట్రోనే ప్రభుత్వం అనుమతి లేకుండా తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్ 2002 ప్రకారం రేట్లను సవరించడానికి మెట్రో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం ప్రకారం మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ) ప్రారంభ చార్జీలను నిర్ణయించే అధికారం కలిగి ఉంటుంది. అయితే, ఈసారి చార్జీల మోత ఎక్కువగా ఉంటుందని సమాచారం. ప్రస్తుత ధరలపై 20 నుంచి 25శాతం పెంచేందుకు మెట్రో అధికారులు సిద్ధమవుతున్నారట.
ప్రస్తుతం మెట్రోలో చార్జీలు కనిష్ఠం రూ. 10, గరిష్ఠం రూ.60 వరకు ఉంది. మెట్రో యాజమాన్యం భావిస్తున్నట్లు మరోవారం రోజుల్లో చార్జీలు పెంపు జరిగితే గరిష్టం రూ. 80 నుంచి రూ. 85 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెంచిన చార్జీల ద్వారా వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కసరత్తు చేస్తోంది.