Outer Ring Road: ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 2, 7 మూసివేత.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రకటన

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించేవారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. వర్షపు నీరు చేరడంతో ఎగ్జిట్ 2, 7లను మూసివేసినట్టు తెలిపారు.

Outer Ring Road: ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 2, 7 మూసివేత.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రకటన

hyderabad outer ring road waterlogging

Updated On : July 27, 2023 / 12:50 PM IST

Hyderabad outer ring road : వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (heavy rains) దంచికొడుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ముఖ్యంగా రహదారులపై పల్లపు ప్రదేశాల్లోకి భారీగా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad Rains) తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి.

ఔటర్ రింగ్ రోడ్డుపై జాగ్రత్త
పలు చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించేవారిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. శంషాబాద్, మేడ్చల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 2, 7లను మూసివేసినట్టు తెలిపారు. ఎగ్జిట్ 2కు బదులుగా.. ఎగ్జిట్ 1 లేదా 3 మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే ఎగ్జిట్ 7కు బదులుగా ఎగ్జిట్ 6 లేదా 8 మీదుగా వెళ్లాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఈ విషయాలను గమనించాలని ట్విటర్ లో తెలిపారు.

 

6 జిల్లాలకు రెడ్ అలెర్ట్
కుండపోత కురుస్తున్న వర్షాలు ఇప్పడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ 6 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.

చుక్కలు చూపిస్తున్న వరంగల్ జాతీయ రహదారి
హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఉప్పల్ సమీపంలో పైఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యం కావడంతో రోడ్డు మొత్తం పూర్తిగా గుంతలమయం అయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరడంతో అటుగా వేళ్ళే వాహనదారు లకు ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు మెల్లగా కదులుతుండడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం విజయవాడ హైవే పై మున్నేరు వరద నీరు చేరడంతో ఖమ్మం నుంచి రాకపోకలు బంద్ అయ్యాయి. సుమారు 30 గ్రామాలకు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read: హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి భారీ వర్షం.. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అత్యధిక వర్షపాతం

రాయదుర్గంలో రహదారులు జలమయం
నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మాదాపూర్ నేక్టార్ గార్డెన్ దగ్గర మాదాపుర్ పోలిస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

జల దిబ్బంధంలో ఖైరతాబాద్ బస్తీలు
భారీ వర్షాలతో ఖైరతాబాద్ లోని కొన్ని బస్తీలు జల దిబ్బంధంలో చిక్కుకున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు నిన్న రాత్రి నుంచి స్థానికులు బయటికి రాలేదు. ఖైరతాబాద్ రోడ్ నంబర్ 02 పాత సిబ్ క్వార్టర్స్ వరద
నీటిలో ఉంది. పలు వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. కరెంట్ లేక, అధికారుల నుంచి సహాయం అందక స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. తమకు సహయం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను
స్థానికులు కోరుతున్నారు.