Hyderabad: పిల్లలను విక్రయిస్తున్న 11 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీ రితు రాజ్ తెలిపారు. ఇవాళ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మాదాపూర్, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, శిశువులను అమ్మే రాకెట్‌ను ఛేదించారని చెప్పారు.
అరెస్టయిన ముఠాలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని వివరించారు. వారి వద్ద ఉన్న ఇద్దరు శిశువులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రితు రాజ్ అన్నారు. అందులోని ఒక మగ శిశువును అహ్మదాబాద్ నుంచి నిందితులు హర్ష రాయ్, దారం లక్ష్మి కొనుగోలు చేసి తీసుకువచ్చారని తెలిపారు. అహ్మదాబాద్‌లోని లేబర్ క్యాంప్ నుంచి ఆ శిశువును తీసుకువచ్చారని వివరించారు.
సిద్దిపేట నుంచి మరో మగ శిశువును కొనుగోలు చేసి తీసుకువచ్చారని డీసీపీ రితు రాజ్ అన్నారు. ఆ శిశువు తల్లిదండ్రులను గుర్తించామని తెలిపారు. పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్‌లో నలుగురిపై చాలా కేసులు ఉన్నాయని డీసీపీ రితు రాజ్ అన్నారు. గంగాధర్ రెడ్డిపై 13, బాబు రెడ్డి, నాగలక్ష్మి, హర్షపై రెండేసి కేసులు ఉన్నాయని వివరించారు.
Also Read: భారతీయులకు షాక్.. హెచ్-1బీ లాటరీ ఇక ఉండదు.. వర్క్ వీసాల జారీ ఇకపై ఇలా..
సరోగసి కోసం మహిళలను గంగాధర్ రెడ్డి ఐవీఎఫ్ సెంటర్లకు తీసుకువస్తుంటాడని డీసీపీ రితు రాజ్ తెలిపారు. గ్యాంగ్ సభ్యులు పేద దంపతులను గుర్తించి, వారికి డబ్బు ఆశ చూపించి వారి వద్ద పిల్లలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
పేద దంపతులకు మూడు లక్షలు ఇచ్చి పిల్లలను కొనుగోలు చేస్తున్నారని డీసీపీ రితు రాజ్ తెలిపారు. కొనుగోలు చేసిన పిల్లలను అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్నారని చెప్పారు.
నిందితులకు ఐవీఏఫ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నాయని డీసీపీ రితు రాజ్ తెలిపారు. అరెస్ట్ అయిన 11 మందిలో సృష్టి కేసుతో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయో తదుపరి దర్యాప్తులో తేలుతుందని అన్నారు.