Fake Tea Powder: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కల్తీ కలకలం చెలరేగింది. జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బయట ఏది తిన్నాలో, ఏది తాగాలో తెలియక పిచ్చెక్కిపోతున్నారు. ఎక్కడ కల్తీ కాటుకి బలైపోతామో అని ప్రాణభయంతో బతుకుతున్నారు. ఏపీలో కల్తీ పాలు మనుషుల ప్రాణాలు తీశాయి. కల్తీ పాలు తాగి నలుగురు చనిపోవడం సంచలనంగా మారింది. కొందరు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. దీనంతటికి కారణం కల్తీ పాలు తాగడమే. తాజాగా హైదరాబాద్ లోనూ కల్తీ కలకలం రేగింది. కల్తీ టీ పొడి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో హైదరాబాద్ లోని చాయ్ లవర్స్ గుండెల్లో వణుకు మొదలైంది.
కల్తీ టీ పొడి తయారు చేసి విక్రయిస్తున్న ముఠా వ్యవహారం బట్టబయలైంది. కల్తీ టీ పొడి తయారీ గురించి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్(వెస్ట్ జోన్) టీమ్ సనత్‌నగర్‌లోని గోదాముపై రైడ్ చేసింది. అక్కడ సింథటిక్ కలర్స్‌తో టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాసుల కక్కుర్తితో టీ పొడిని కల్తీ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో అతడు అంగీకరించాడు. కోకోపీట్ (కొబ్బరి పీచు పొడి)ను కొనుగోలు చేసి, అందులోని వ్యర్థాలను తొలగించి, వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు.
కోకోపీట్ (కొబ్బరి పీచు పొడి), వేడి బెల్లం నీటితో కల్తీ టీ పొడి తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కిలో టీ పొడికి నాసిరకం డస్ట్, గ్రాన్యూల్స్ మిక్స్ వాడుతున్నాడు. నకిలీ టీ పొడినే అసలైన టీ పొడిగా నమ్మించి టీ స్టాల్స్ కు, షాపులకు భారీ ధరకు విక్రయిస్తున్నాడు. 120 కిలోల కల్తీ టీ పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 138 కిలోలు కోకోపీట్ మిశ్రమం సీజ్ చేశారు. సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ (సింథటిక్ ఫుడ్ కలర్స్) కలర్స్ స్వాధీనం చేసుకున్నారు.
* కోకోపీట్ లోని వ్యర్థాలను తొలగించి వేడి బెల్లం నీటితో కలిపి మూడు రోజుల పాటు ఎండబెడతాడు.
* సన్‌సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ ఆరెంజ్ లాంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతాడు.
* ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో వాడతాడు.
* ఒక కిలో కల్తీ టీ పొడి తయారీకి 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్‌ను మిక్స్ చేసేవాడు.
కల్తీ టీ పొడి గురించి తెలుసుకుని చాయ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇకపై బయటికి వెళ్లి టీ తాగాలంటేనే ఆలోచిస్తున్నారు. కాసుల కక్కుర్తితో కల్తీ టీ పొడి తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కల్తీ టీ పొడి వ్యవహారంపై పోలీసులు టీ స్టాల్స్ నిర్వాహాకులను అలర్ట్ చేశారు. గుర్తింపు పొందిన విక్రేతల దగ్గరే టీ పొడిని కొనుగోలు చేయాలని సూచించారు. ధర తక్కువ అని ఎక్కడ పడితే అక్కడ కొంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చన్నారు. ఆహార కల్తీదారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆహార కల్తీకి సంబంధించి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Also Read: మహిళల కోసం మహిళా డ్రైవర్లు, భారత్ టాక్సీ కొత్త ‘సారథి దీదీ’ సర్వీసు.. ఇలా బుక్ చేయండి