హైదరాబాద్ లో వరుణుడు సెకండ్ ఇన్నింగ్స్,.రెండు రోజులు జాగ్రత్త

  • Publish Date - October 19, 2020 / 07:05 AM IST

Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్‌లో వరుణుడు సెకండ్‌ ఇన్సింగ్‌ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.



భాగ్యనగరంలో కురిసిన వర్షం దెబ్బకు నగరమంతా ఇంకా నీటి నుంచి బయటపడలేదు. ఇటీవలి బీభత్సం నుంచి తేరుకునేలోపే.. వరుణుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేశాడు. దీంతో.. అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌లన్నీ అలర్టయ్యాయి. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణశాఖ అధికారులు.



తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. అది పశ్చిమ దిశగా ప్రయాణించి.. బలహీన పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వర్షాలు కురుస్తాయని… 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ చెప్పింది.



ఇటీవలే.. హైదరాబాద్‌లో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. తర్వాత.. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. చాలా ప్రాంతాల్లో వర్షపునీరు అలాగే నిలిచిపోయింది. వర్ష బీభత్సం నుంచి హైదరాబాద్ కోలుకుంటోందన్న టైంలో.. వరుణుడు మళ్లీ విరుచుకుపడ్డాడు. గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ దంచుతోంది వర్షం. సోమవారం రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ చెబుతోంది.