Meghana Musunuri
Meghana Musunuri: హైదరాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలికి అరుదైన గౌరవం దక్కింది. ఫౌంటెయిన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వ్యవస్థాపకురాలైన ముసునూరి మేఘన ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ అవార్డు రేసులో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఈ అవార్డుకు ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల నుంచి 8 వేల నామినేషన్లు రాగా మేఘన అందులో టాప్-50 అభ్యర్థులలో నిలిచారు. ఈ గ్లోబల్ జాబితాలో మన దేశం నుండి మేఘనతో పాటు బీహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు సత్యం మిశ్రా కూడా ఉన్నారు.
సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్, గణితం బోధించే మేఘన స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఫౌండర్‌గా, ఓ ఔత్సాహి పారిశ్రామికవేత్తగా, దాతృత్వ భావనలున్న వ్యక్తిగా ఈ రేసులో నిలవగా గణిత శాస్త్రంలో ‘ట్రిక్స్’తో విద్యార్థులను చదువును సులభం చేసినందుకు సత్యం ఎంపికయ్యారు. యునెస్కో భాగస్వామ్యంతో వార్కే ఫౌండేషన్ ప్రతీ ఏట ఈ గ్లోబల్ టీచర్ అవార్డును ప్రకటిస్తుండగా ఈ ప్రైజ్ కింద రూ.7.35 కోట్ల (మిలియన్ డాలర్లు) నగదు బహుమతి అందజేస్తారు. గతేడాది కూడా మన దేశానికే ఈ అవార్డు దక్కడం విశేషం. మహారాష్ట్రకు చెందిన రంజిత్‌సింగ్ దిశాలే గతేడాది గ్లోబల్ టీచర్ ప్రైజ్‌ను గెల్చుకొన్నారు.
గ్లోబల్ టీచర్ అవార్డుతో పాటు గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్‌కు కూడా టాప్-50 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయగా భారత్ నుంచి నలుగురు విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు. కైఫ్ అలీ(జామియా మిలియా), ఆయుష్ గుప్తా(ఐఐఎం అహ్మదాబాద్), సీమా కుమారి(జార్ఖండ్), విపిన్ కుమార్ శర్మ(హర్యానా సెంట్రల్ వర్సిటీ) ఈ జాబితాలో చోటు సాధించగా ఇందులో ఎవరు ఈ అవార్డును దక్కించుకొని మన దేశ విశిష్టతను ప్రపంచానికి చాటనున్నారన్నది ఆసక్తిగా మారింది. కాగా.. ఈ అవార్డులలో విజేతలను నవంబర్‌లో పారిస్‌లో జరగనున్న కార్యక్రమంలో ప్రకటించనున్నారు.