వామ్మో.. పొలిటికల్ పార్టీలకు రూ.110 కోట్లు డొనేట్ చేసిన హైదరాబాద్ టెకీలు..!? ఇదెక్కడి స్కామ్‌రా మామా..

చాలా మంది ఐటీ ఉద్యోగులు దొంగ తెలివితో ఏమేం చేస్తున్నారో తెలుసా?

పన్నుల బారి నుంచి తప్పించుకోవడానికి ఒక్కో వర్గం వారిది ఒక్కో ప్లాన్‌. చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుని పన్నులను ఎగ్గొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి స్కామ్‌లకు పాల్పడుతున్న వారిపై కూడా ఆదాయపన్ను శాఖ ఓ కన్నేసి ఉంచుతుంది. ఇప్పుడు ఆదాయపన్ను శాఖ దృష్టి హైదరాబాద్‌లోకి టెకీలపై పడింది.

రిజిస్ట్రర్‌ చేసుకున్న గుర్తింపుపొందని పొలిటికల్ పార్టీల (ఆర్‌యూపీపీ) కు హైదరాబాద్ టెకీలు రూ.110 కోట్లు డొనేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను నుంచి తప్పించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్‌లోకి కొందరు టెకీలు ఈ రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. ఆర్‌యూపీపీలకు అత్యధిక విరాళాలు ఇస్తున్న వారిగా టెకీలు నిలుస్తున్నారు.

ఇలా మొదట భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి, పన్ను రిబేటులను క్లెయిమ్ చేసుకుని, ఆ తరువాత వారి విరాళాలను తిరిగి తీసుకున్నారు. అంటే వారు తమ పన్నులను తగ్గించుకోవడానికి చట్టపరమైన లొసుగును బాగా వాడేసుకుంటున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 జీజీసీ కింద రాజకీయ పార్టీలకు డబ్బును విరాళంగా ఇస్తే ప్రజలు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని తగ్గించడానికి వీలవుతుంది.

Kumbh Mela: కుంభమేళాలో ప్రధాని మోదీ.. బోటులో వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం.. వీడియో

అంటే ఎవరైనా విరాళం ఇస్తే, వారు తక్కువ పన్ను చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని టెకీలు పన్నులు ఎగ్గొడుతున్నారు. ఇలా హైదరాబాద్‌లోకి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఏకంగా రూ.110 కోట్ల రీఫండ్‌ స్కామ్‌ను చేసినట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించింది.

స్కామ్‌ను ఎలా గుర్తించారు?
హైదరాబాద్‌లోని 36 కంపెనీల ఐటీ ఉద్యోగులు రీఫండ్‌ కోసం క్లెయిమ్ చేసుకున్నారు. రూ.46 లక్షల జీతం వచ్చే ఓ ఉద్యోగి తాను రూ.45 లక్షల విరాళాన్ని ఓ రాజకీయ పార్టీకి ఇచ్చినట్లు చూపిస్తూ రీఫండ్‌ క్లెయిమ్‌ చేసుకున్నాడు.

కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఐటీ ఉద్యోగుల నుంచి చెక్ , బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా విరాళాలను స్వీకరించాయి. దీంతో వారిపై ఐటీ శాఖ దృష్టి పెట్టి వారు మొత్తం రూ.110 కోట్ల రీఫండ్‌ స్కామ్‌ను చేసినట్లు గుర్తించింది. ఐటీ ఉద్యోగులు ఓ కామన్ ఈ-మెయిల్‌ అడ్రస్‌తో రీఫండ్‌ కోసం క్లెయిమ్స్‌ చేసుకున్నట్లు ఐటీ దృష్టికి వచ్చింది.

తెలంగాణతో పాటు గుజరాత్‌లోనూ ఆర్‌యూపీపీకు ఐటీ ఉద్యోగులు విరాళాలు ఇచ్చి, రీఫండ్‌ కోసం క్లెయిమ్‌ చేసుకుని, మళ్లీ ఆ డబ్బును తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఓ పెద్ద ఐటీ సంస్థలో పనిచేసే 430 మంది ఉద్యోగులు రూ.17.8 కోట్లకు డిడక్షన్స్‌ను 80 జీజీసీ కింద క్లెయిమ్ చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ పరిశీలనకు వచ్చింది. వీటి అన్నింటిపై ఆదాయపన్ను శాఖ కూపీ లాగుతోంది.