Fake Number Plates: ఫేక్ నంబర్ ప్లేట్ వాడుతున్నారా? ఇకపై క్రిమినల్ కేసులు నమోదు.. పోలీసుల తీవ్ర హెచ్చరికలు
హైదరాబాద్ మహానగరంలో నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్ల(Fake Number Plates)తో రోడ్లపై విహరిస్తున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
- V Santhosh Kumar
- Published on- August 8, 2026 / 05:54 PM IST
Hyderabad traffic police crackdown fake number plates criminal cases registered
- ఫేక్ నంబర్ ప్లేట్లపై నిఘా
- ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు
- ఐదు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు
Fake Number Plates: హైదరాబాద్ మహానగరంలో నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లతో రోడ్లపై విహరిస్తున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. చలానాల నుంచి తప్పించుకోవడానికి, క్రిమినల్ చర్యలకు పాల్పడే క్రమంలో పోలీసుల కంట పడకుండా ఉండేందుకు కొందరు వాహనాల అసలు గుర్తింపును దాచిపెడుతున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఫేక్ నంబర్ ప్లేట్లు వాడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
చలానాల ఎగవేతకు అక్రమ మార్గాలు:
ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబర్ ప్లేట్లలో అంకెలను మార్చడం, ఫేక్ నంబర్ ప్లేట్ల(Fake Number Plates)ను ఉపయోగించడం లాంటి అక్రమాలకు కొందరు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల అమాయక వాహనదారులకు చలానాలు వెళ్లడమే కాకుండా, నగర రక్షణకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లుతోందని పోలీసులు గురిచేశారు. అందుకే నగరం అంతటా నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, నకిలీ నంబర్ ప్లేట్ల ఆధారంగా వాహనాలను తనిఖీ చేసే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.
పలు స్టేషన్ల పరిధిలో క్రిమినల్ కేసులు:
గడిచిన ఒక్క వారంలోనే ఫేక్ నంబర్ ప్లేట్లు వాడుతున్న ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట, చిలకలగూడ, కంచన్‌బాగ్, బాండ్లగూడ పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు నల్గొండ జిల్లా దిండి పీఎస్‌లోనూ కేసులు నమోదయ్యాయి. నంబర్ ప్లేట్లతో తిమ్మినిబమ్మిని చేసే వారిపై IPC, రవాణా చట్టాల కింద కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
