Hydra : హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసి అయినా మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే అన్నారు. చెరువుల్లో కాలేజీలు కడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒవైసి బ్రదర్స్ సలకం చెరువులో నిర్మించిన కట్టడాలను తొలగించాలని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్పొరేటర్లతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో కాలేజీలు కట్టి ఉంటే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
Also Read : జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతకు హైడ్రా రెడీ..? రంగంలోకి ఇరిగేషన్ అధికారులు..
రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు. రంగనాథ్ ను కలిసిన బీజేపీ కార్పొరేటర్లు ఓల్డ్ సిటీ చెరువులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. చెరువును ఆక్రమించి ఒవైసి సోదరులు కట్టిన భవనాలను కూల్చేయాలన్నారు.
చాంద్రాయణగుట్ట సలకం చెరువుని ఆక్రమించి ఫాతిమా కాలేజీని నిర్మించారని ఒవైసి సోదరులపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోనుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ”పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడే కూల్చితే వాళ్ల అకడమిక్ ఇయర్ డిస్ట్రర్బ్ అవుతుంది. ఒవైసి అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్. అక్రమ కట్టడాలు అని నిర్ధారణ అయితే తొలగించేందుకు సమయం ఇస్తాం. వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే చర్యలు తీసుకుంటాం” అని తేల్చి చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
చాంద్రాయణగుట్టలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసికి చెందిన ఫాతిమా కాలేజీ ఉంది. సలకం చెరువు ఎఫ్ టీఎల్ ను ఆక్రమించి దాన్ని నిర్మించారని శాటిలైట్ చిత్రాల ద్వారా సులభంగా తెలుస్తుందని పలువురు పోస్టులు పెడుతున్నారు. చెరువుల్లోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. ఒవైసి కాలేజీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు తగ్గేదేలే అన్నరీతిలో బడాబాబులకు సంబంధించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ దూసుకెళ్తున్న హైడ్రా.. ఒవైసి కాలేజీ విషయంలోనూ అలానే ముందుకు వెళ్తుందా? లేక.. ఎంఐఎంతో రాజకీయ అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉందంటున్నారు బీజేపీ నాయకులు.