I resign as CM if BJP leaders prove pension charges CM KCR : బీజేపీకి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్. పెన్షన్ల విషయంలో బీజేపీ నేతలు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, 2,016 రూపాయల పెన్షన్‌లో 1600ల రూపాయలు కేంద్రం ఇస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారని.. ఇది నిజమని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కేసీఆర్.
జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ర్టంలో 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నామని వివరించారు. నెల రాగానే పెన్షన్లు అందిస్తున్నట్లు, కేంద్రం కేవలం 6 లక్షల 95 వేల మందికి మాత్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. మనిషికి రూ. 200 మాత్రమే కేంద్రం ఇస్తోందని, సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ. 105 కోట్లు మాత్రమేనన్నారు.
రాష్ర్టం రూ. 10 వేల కోట్ల నుంచి 11 వేల కోట్లు ఇస్తోందని, బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకవేళ తాను చెప్పేది అబద్ధమే అయితే, రుజువు చేస్తే తాను ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతానంటూ సవాల్ విసిరారు.
రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్రంపై రైతులు ఉద్యమించాలన్నారు సీఎం కేసీఆర్. తాము రైతును ఆదుకునేందుకు రైతులకు అధిక ధర చెల్లించాలని అనుకుంటుంటే ఎఫ్‌సీఐ 18 వందల 88 రూపాయలే చెల్లించాలని నిబంధన పెట్టిందని విమర్శించారు. కేంద్ర చట్టం వల్ల కార్పొరేట్ గద్దలు రెచ్చిపోతాయన్నారు. రైతు వేదికలంటే ఆషామాషీ కాదని.. అవి ఆటంబాంబు లాంటివన్నారు కేసీఆర్. జాతీయ పార్టీలు టీఆర్ఎస్‌పై ఎంత బురద జల్లినా దుబ్బాకలో గెలవలేరన్నారు.