ఏదైనా ఒక ఇంట్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు బయటపడినా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్లతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధాన్ని చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఒక ఇంట్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు బయటపడినా చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్లను కంటైన్ మెంట్ చేస్తారు. ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్బంధాన్ని చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ జోన్ లోకి అన్ని రోడ్లు, మార్గాలు మూసివేసి వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే దారి ఏర్పాటు చేయాలని సూచించింది. 24 గంటలపాటు పోలీస్ బందోబస్తు ఉండనుంది.
అపార్ట్ మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో పాజిటివ్ కేసు బయటపడితే వాటి పరిధి వరకు మాత్రమే కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని తెలిపింది. కేసుల సంఖ్యను బట్టి 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పింది. సరిహద్దులు ఏర్పాటు చేయాలని, తగినంత బఫర్ జోన్ కూడా ఉండాలని తెలిపింది. కంటైన్మెంట్ జోన్ కు వెళ్లే అన్ని మార్గాలను ఎనిమిది అడుగుల ఎత్తున్న బారికేడ్లతో మూసేయాలని వెల్లడించింది.
సరైన కారణాలు లేకుంటే కంటైన్మెంట్ జోన్ లోపలికి, బయటికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించవద్దని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14, 2020) ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ ఎంసీని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ అమలు చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మరో ఉత్తర్వు జారీ చేశారు.
జోన్ పరిధిలోని ప్రజలు ఇల్లను దాటి బటయటికి రావడానికి వీల్లేదు. తమ ఇంటి ముందు ఉన్న ఫుట్ పాత్ లపై కూడా నడవవద్దు. కంటైన్మెంట్ జోన్లని తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరి రాకపోకలు రికార్డు చేస్తారు. రోగ నివారణ చర్యల్లో భాగంగా నిర్ణీత వ్యవధుల్లో మాస్కులు అందచేస్తారు. ప్రజలకు అవసరమైన సరుకులు ఇళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు.
రైతు బజార్ వ్యాన్లు, సూపర్ మార్కెట్లు, కిరాణ, పాల వ్యాపారులు, వెజిటబుల్స్ వ్యాపారులు, మెడికల్ స్టోర్స్ నిర్వహకులతో నోడల్ అధికారి మాట్లాడి ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల లోపు నిత్యావసరాలను ఇళ్ల దగ్గరికే పంపిస్తారు. వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ధరలు పెంచకుండా చర్యలు తీసుకుంటారు. నోడల్ అధికారి పేరు, ఫోన్ నెంబర్ తో తెలుగు, ఉర్దూలో కరపత్రాలు పంచుతారు. ప్రజలు ఏం చేయవచ్చు, ఏం చేయరాదో రికార్డు మెసేజ్ ఆటో ద్వారా ప్రచారం చేస్తారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల ఇంటివారికి నిత్యవసరాలు పంపిణీ చేసే అధికారులు తప్పనిసరిగా పీపీఈ ధరించాలి. కంటైన్మెంట్ జోన్ పరిధిలో నివసించే ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను అనునిత్యం అధికారులు అడిగి తెలుసుకుంటారు.
ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తారు. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే ఆస్పత్రిలో చికిత్స చేస్తారు. నెగెటివ్ రిపోర్టు వస్తే వారిని తప్పనిసరి హోం ఐసోలేషన్ లో ఉంచుతారు. కొత్త పాజిటివ్ కేసులు గుర్తిస్తే ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను రూపొందిస్తారు. కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి ఆరోగ్యస్థితిని బట్టి క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కు తరలిస్తారు.