Seasonal Fevers
Seasonal Diseases : గత వారం రోజులుగా తెలంగాణా రాష్ట్రాన్ని వాన ముసురు వదలడం లేదు.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. మరో మూడు రోజులు వాన ముసురు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై….సీజన్ వ్యాధులను అరికట్టేందుకు రంగంలోకి దిగింది. వాన ముసురులో జాగ్రత్తగా ఉండకపోతే, వ్యాధుల బారిన పడక తప్పదని హెచ్చరిస్తోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్ల పరిసరాల్లో వాన, మురుగు నీటి నిల్వలు పెరుగుతున్నాయి..ఈగలు, దోమలు భారీగా వృద్ధి చెందుతున్నాయి..ఇప్పటికే వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి..వరద, మురుగు నీటి నిల్వల కారణంగా డయేరియా, జిగట విరేచనాలు, కామెర్లు, గ్యాస్ట్రోఎంటరైటిస్, మలేరియా, డెంగీ, గున్యా, మెదడు వాపు తదితర వ్యాధుల ముప్పు పొంచి ఉంది.
హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు లక్షణాలతో ఎక్కువ మంది వస్తున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ ఓపీ రోజుకు 600 కు పైగా నమోదవుతోంది. గత 4 వారాలుగా డెంగీ విజృంభిస్తోందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,165 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 504, రంగారెడ్డిలో 96, కరీంనగర్‌లో 80, ఆదిలాబాద్‌లో 57, మహబూబ్‌నగర్‌లో 54, మేడ్చల్ మల్కాజిగిరిలో 54, పెద్దపల్లిలో 40 డెంగీ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఈ ఏడాది ఇప్పటివరకూ 203 మలేరియా కేసులు నమోదు కాగా.. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 115, ములుగులో 43 నిర్ధారించారు. చికెన్ గున్యా కేసులు 40 నమోదవగా… అందులో 39 ఖమ్మంలోనే నమోదు అయ్యాయి.. దోమలు వృద్ధి చెందకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే.. మున్ముందు జ్వరాల కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో ప్రధానంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశాలెక్కువ. ప్రజలు సాధ్యమైనంత వరకూ వేడిచేసి చల్లార్చిన నీటినే తాగాలి. ముఖ్యంగా శరీరంపై గాయాలకు వరదనీరు తాకితే.. వెంటనే సబ్బుతో శుభ్రపర్చి, చికిత్స అందించాలి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. విద్యుత్ తీగలు, ఉపకరణాలను పక్కకు జరపాల్సి వచ్చినప్పుడు.. ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.
భవనాల్లో పగుళ్లు, నీరు కారడం వంటివి కనిపిస్తే అప్రమత్తమవ్వాలి. ఇళ్లలో పాత సామాన్లు, నీళ్ల డ్రమ్ములు, వాడిపడేసిన టైర్లు, కూలర్లు..తదితరాల్లో, పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా జాగ్రత్తపడాలి. నిల్వ నీటిపై తరచూ దోమల మందు పిచికారీ చేయాలి. ఇళ్లలో దోమతెరలు, దోమల సంహారిణులు వాడాలి. కొవిడ్ నిబంధనలు కొనసాగించాలి. మాస్కు ధరించడంతో కొవిడ్‌తో పాటు కాలానుగుణ వ్యాధుల నుంచి సైతం రక్షణ పొందవచ్చు.
వాతావరణం చల్లబడడంతో బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభించడానికి అనుకూల కాలమిది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, నిమోనియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్ తదితర సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లల్లో వీటి తీవ్రత అధికంగా ఉంటుంది. తాగునీటి పైపులైన్లు పగిలి, మురుగు నీటితో కలిసే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మలం, రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్‌లు తాగు నీటిలోకి చేరిపోతాయి. ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అవసరముంటే తప్ప బయటకు వెళ్లొద్దు..వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది..జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు మూడు రోజులైనా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించండి..కొవిడ్ నుంచి బయటపడ్డా..ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు..గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో లభించే తినుబండారాలు, పానిపూరి, వంటి వాటిని తింటే రోగాల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు వస్తాయి. కరోనాకు ముందు 2019లో వేలల్లో డెంగీ కేసులు వచ్చాయి. అప్పుడు కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1184 డెంగీ కేసులు వచ్చాయి. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ డెంగీ కేసులు నమోదయ్యాయి. జూన్‌లో 563 కేసులు రాగా.. జులైలో తొలి 10 రోజుల్లోనే 222 కేసులు వచ్చాయి. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు చేపట్టింది.
దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు..మున్సిపల్, పంచాయితీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నారు..ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మేలో 2700, జూన్‌లో 2752 కేసులు వచ్చాయి. ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవడం ద్వారా ప్రజలు ఈ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చు.
ప్రజలు ఫ్రైడే.. డ్రై డే కార్యక్రమం చేపట్టాలి. వేడివేడి ఆహారం తీసుకోవాలి..నీరు రంగు మారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలి. జలుబు, జ్వర, విరేచనాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్ట్ కిట్‌లు సిద్ధంగా ఉన్నాయి..జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఉండి మాస్క్ ధరిస్తూ ఐసోలేషన్ పాటించాలి.. గత ఆరు వారాలుగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది.. కరోనా గురించి భయపడాల్సిన పని లేదు. ఇది ఎండమిక్ దశకు చేరుకుంది. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయి.
కొవిడ్ కూడా ఓ సీజనల్ వ్యాధిగా మారిపోయింది. లక్షణాలుంటే కేవలం 5 రోజులే క్వారంటైన్‌లో ఉండాలి. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదు.. డబ్ల్యూహెచ్‌వో కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. కొవిడ్ సోకి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఆస్పత్రిలో చేరాలి..ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం లేకుండా ప్లేట్‌లెట్ మార్పిడి చేయొద్దని ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవద్దు. అత్యవసరం అయితే ప్లేట్‌లెట్ చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.