Site icon 10TV Telugu

Telangana Holidays : భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు

Holidays (1)

Holidays (1)

Telangana Holidays : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్‌తో.. తెలంగాణలో కుండపోత వానలు దంచికొడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్లు ఏకథాటిగా భారీ వర్షం పడుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముంది.

Red Alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్‌ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి భారీగా నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలి పెడుతున్నారు. మేడిగడ్డ దగ్గర నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్‌లోకి 5 లక్షల 58 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో 65 గేట్లు ఎత్తి 5 లక్షల 84 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Exit mobile version