Hyderabad
Hyderabad Living Cost: దేశంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ మహానగరం ఒకటి. హైదరాబాద్ లో ప్రపంచంలో పేరుపొందిన ప్రముఖ ఐటీ, ఇతర కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో యువత ఉద్యోగాలకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచేకాక.. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరనివాసం ఏర్పర్చుకుంటున్నారు. చిన్నాచితక ఉద్యోగాలు, ఉపాధికోసం పెద్దెత్తున ప్రజలు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. ఫలితంగా రోజురోజుకు నగరంలో జనాభా పెరుగుతోంది. లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది.
హైదరాబాద్ మహానగరంలో సాధారణ జీవనం సాగించాలన్నా ఖర్చు మోపెడవుతుంది. సింగిల్ రూమ్ కావాలంటే రూ. 8వేలు పెట్టాల్సిందే. నెలకు గ్రాసరీ, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. మొత్తంగా ఇక్కడ బతకాలంటే ప్రతి మనిషికి ప్రతి నెలా రూ. 31 వేలు అవసరమవుతున్నాయి. ఇన్ఫోమెన్స్ ఆన్ లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ సర్వే రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ఎంపిక చేసిన 10 ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేయగా.. లివింగ్ కాస్ట్ లో హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది.
దేశంలోని బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, లక్నో, కోల్ కతా, జైపూర్ వంటి నగరాల్లో బతకాలంటే కనీసం ఎంత ఖర్చు అవుతుందనే విషయంపై ఇన్ ఫోమెన్స్ సంస్థ సర్వే నిర్వహించింది. మొదటి స్థానంలో బెంగళూరు, చివరి స్థానంలో జైపూర్ నిలిచాయి. హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ నగరంలో జీవనం సాగించాలంటే కనీసం రూ.31వేలు అవసరం అని సర్వే సంస్థ తేల్చింది. అయితే, ప్రస్తుతం భాగ్యనగరంలో లక్ష మంది జీతం రూ.15వేలకు మించడం లేదు.
సర్వే వివరాల ప్రకారం.. హైదరాబాద్ లో ఒక ఫ్యామిలీ ఖర్చు సగటున రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అవుతుంది. ఇందులో ప్రధానంగా ఇంటి కిరాయిలు, రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు, అదనపు ఖర్చులు కలిపి రూ.31వేలకుపైనే అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు వీటికి అదనం. ఇక సినిమాల లాంటి సరదాల గురించి సగటు వేతనజీవులు ఎప్పుడో మర్చిపోయారు. ఖర్చులు పెరిగినట్లుగా ఆదాయం పెరగకపోవటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు జాబ్ ఎక్కడ పీకేస్తారో అనే భయంతోనే సగం మంది బతకాల్సి పరిస్థితి.
ముఖ్యంగా హైదరాబాద్ లో ఇంటి కిరాయిల భారం ఎక్కువ. నగరంలో సింగిల్ బెడ్ రూం కావాలంటే ఎంత వెనకబడిన ప్రాంతమైనా రూ.6వేలకు తక్కువ దొరకడం లేదు. కొంచెం మంచిగా ఉన్న బస్తీ అయితే రూ.10వేల నుంచి 15వేలు ఉంటుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఐటీ ఏరియాలైన గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇంటి కిరాయి రూ.25వేలుపైమాటే ఉంటుంది. దీంతో చాలా మంది హైదరాబాద్ లో జీవనం సాగించే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు స్లమ్స్, మామూలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే తక్కువకు అద్దెకు తీసుకొని బతుకులీడుస్తున్నారు.