Katti Venkata Swamy
Katti Venkata Swamy – BC Tickets : తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి మొదలైంది. టికెట్ల పంచాయితీ పార్టీ హైకమాండ్ వరకు వెళ్లింది. టికెట్ల కేటాయింపులో బీసీలకు న్యాయం జరుగలేదని పలువురు నేతలు అంటున్నారు. ఈ మేరకు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ నేత కత్తి వెంకట స్వామి అన్నారు.
50 పైగా స్థానాల్లో బీసీ అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి ఇచ్చామని తెలిపారు. తప్పనిసరిగా బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సునీల్ కనుగోలు సర్వేలు తాము నమ్మడం లేదన్నారు. టికెట్ల కేటాయింపులో సర్వే ఒక భాగం మాత్రమేనని అదే తప్పనిసరి అన్నట్లు టికెట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని బీసీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ అభ్యర్థులు విజయం సాధిస్తారని బాండ్ పేపర్ పై రాసి ఇస్తామని చెప్పారు. రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేదు కాబట్టే ఢిల్లీలో న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చామని తెలిపారు.
బీసీలు లేకుండా కాంగ్రెస్ ఎలా విజయం సాధిస్తుందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీసీలే కాదు రెడ్డిలు కూడా ఓడిపోయారని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి భార్య, జానారెడ్డి ఓడిపోయారని గుర్తు చేశారు. గతంలో ఓడిపోయారని టికెట్లు ఇవ్వమనడం సరికాదన్నారు.