ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు వార్, ప్రోటోకాల్ రగడలు..డైలీ ఎపిసోడ్ అయిపోయాయి. పాత, కొత్త సీనియర్ జూనియర్ల మధ్య పంచాయితీ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం పక్క జిల్లాకు చెందిన ఓ నేత గత కొన్ని నెలలుగా పెత్తనం చలాయించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ నేత పార్టీ పెద్దలకు నేరుగా టచ్‌లో ఉంటాడు సర్డుకుపోదామని వేచి చూసిన జిల్లా నేతలు.. ఒక్కసారిగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారట. కొత్తగా వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఆ నేత తీరుపై ఫిర్యాదు చేశారట. ఒక్కరు కాదు ఇద్దరూ..ఏకంగా 20 మందికిపైగా నేతలు ఆ పక్క జిల్లా నాయకునిపై కంప్లైట్ ఇచ్చారట. పార్టీని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడని..పక్క జిల్లా నేతకు ఇక్కడేం పని అంటూ గరం గరం అయ్యారట.
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ముగ్గురు నేతలు ఒకే నేతను లక్ష్యంగా చేసుకుని మీనాక్షి నటరాజన్ ముందు పలు అంశాలను ఉంచారట. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ నేత తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల నేతలు మూకుమ్మడి ఫిర్యాదు చేశారు.
ఆయన పెత్తనం చలాయించడమే కాకుండా పార్టీ ఫండ్ పంపకాల్లో కూడా వేలు పెడుతున్నాడని దుయ్యబట్టారు. అధికారుల బదిలీల్లో కూడా ఆయనదే ప్రధాన పాత్ర అని ఫిర్యాదు చేశారట. పార్టీని కులాల వారీగా విభజిస్తున్నారని జిల్లా పార్టీలో గ్రూప్‌లుగా మారడానికి ఆ నేతనే కారణమని ఆరోపించారట.
తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఫిర్యాదు
పక్క జిల్లా నేత తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం పార్టీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. సదరు నేత పెత్తనం చేయడమే కాకుండా తన కనుసన్నల్లోనే పార్టీ యాక్టవిటీ నడవాలని హుకుం జారీ చేయడం చాలామందికి మింగుడు పడటం లేదట.
గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ వ్యవహారాల బాధ్యతలు చూస్తున్న ఆ నేత..కొత్తగా పార్టీలోకి వచ్చినవారిని ప్రోత్సహిస్తున్నారట. ఏంటిదని ప్రశ్నిద్దామంటే తనకు రాష్ట్రస్థాయిలో పెద్ద నేతల అండ ఉందని చెప్పుకుంటున్నారట.
అయితే గ్రూప్‌లు వద్దు..కో ఆర్డినేషన్ కోసం ఓ కమిటీ వేస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు సమాచారం. పీసీసీ చీఫ్ కూడా ఈ వ్యవహారంలో సీరియస్ అవ్వడంతో పాటు.. పెత్తనం చేసే పక్క జిల్లా నేతను ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి కాలు పెట్టనీయనంటూ హామీ ఇచ్చారట. గతంలోనూ ఇదే నాయకుడిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పార్టీ రాష్ట్ర నాయకత్వం చూసి చూడనట్టు వ్యవహరించిందని లోలోపల మసలిపోతున్నారు కొందరు నేతలు. ఇప్పుడు నేతల ఫిర్యాదుతో అయినా..ఆ పక్క జిల్లా లీడర్ పెత్తనానికి చెక్ పడుతుందా లేదా అనేది చూడాలి మరి.