Jagadish Reddy: కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్
కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సంచలన కామెంట్స్ చేశారు.
- V Santhosh Kumar
- Published on- September 4, 2026 / 05:13 PM IST
jagadish reddy sensational comments on konda surekha entry into brs
- రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి
- సురేఖకు బీఆర్ఎస్ తలుపులు బంద్
- ఇద్దరు ఎమ్మెల్యేలు రాకకు రెడీ
Jagadish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను గత వెయ్యి రోజులుగా ద్రోహం, మోసం చేస్తోందని, తీవ్ర అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఒక అవినీతి అనకొండ ఉందని ఆరోపించిన ఆయన, నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే కఠిన చర్యలు తీసుకుని ఆయనను సీఎం పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో మన నీటి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. సీఎం, మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు దీవెనలు ఉన్నాయని విమర్శించారు.
పార్టీ మార్పిడులు, చేరికలపై స్పష్టత:
ఇతర పార్టీల నాయకుల చేరికలపై మాట్లాడిన జగదీష్ రెడ్డి, కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని స్పష్టం చేశారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నా పార్టీలోకి తీసుకోమని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడుపోయినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలలో క్యారెక్టర్ ఆధారంగా ఒకరిద్దరిని తప్ప మిగిలిన వారిని తిరిగి చేర్చుకోమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా సంచలన విషయం వెల్లడించారు.
ఈడీ రైడ్స్, డీ-లిమిటేషన్‌పై విమర్శలు:
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన రైడ్‌పై ఈడీ ఎందుకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభ ఎథిక్స్ కమిటీకి నిజాయితీ ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన (డీ-లిమిటేషన్) కచ్చితంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని, ఆ వ్యతిరేకత నుంచి బయటపడటానికే చంద్రబాబు డీ-లిమిటేషన్ జరగాలని భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
