Medaram Mini Jatara: ‘మేడారం మినీ జాతర’ తేదీలు ఖరారు.. 4 రోజులు ప్రత్యేక పూజలు.. ఏర్పాట్లకు సిద్ధమవుతున్న ప్రభుత్వం!
ములుగు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంలో నిర్వహించే మినీ జాతర(Medaram Mini Jatara) తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది.
Medaram Mini Sammakka Saralamma Jatara Dates and Puja Details
Medaram Mini Jatara: ములుగు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంలో నిర్వహించే మినీ జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ మినీ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతర తరహాలోనే, సమ్మక్క పున్నమిని పురస్కరించుకుని ఈ మినీ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు పూజారుల సంఘం దేవాదాయ శాఖతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్కకు సమాచారం అందిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసింది.
నాలుగు రోజుల పూజా కార్యక్రమాల వివరాలు – సమ్మక్క పున్నమి ప్రత్యేకతలు:
ఫిబ్రవరి 17న సారలమ్మ గద్దె వద్ద ప్రత్యేక పూజలతో జాతర (Medaram Mini Jatara)ప్రారంభమవుతుంది. 18న సమ్మక్క గద్దె వద్ద, 19న సమ్మక్క-సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై పూజారులు సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. 20వ తేదీ సాయంత్రంతో ఈ వేడుకలు ముగుస్తాయి. మహా జాతరలో మాత్రమే దేవతలను గద్దెలపైకి తీసుకువస్తారని, మినీ జాతరలో గద్దెల వద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పూజారులు స్పష్టం చేశారు.
10 లక్షల మందికి పైగా భక్తుల రాక – అధికారుల ముందస్తు ఏర్పాట్లు:
తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు ఈ మినీ జాతరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుధ్యం, రవాణా, శాంతిభద్రతల పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సిద్ధబోయిన జగ్గారావు, చందా గోపాల్ రావు కోరారు.
