Jagdish Reddy: మోదీ పాలనలోనే ఇవన్నీ జరిగాయి: మంత్రి జగదీశ్ రెడ్డి

ఈ విషయంలో కాంగ్రెస్ ని బీజేపీ మించిపోయిందని జగదీశ్ రెడ్డి చెప్పారు.

Jagdish Reddy

Jagdish Reddy – Narendra Modi: బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు సరికాదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ మీద, సీఎం కేసీఆర్ (KCR) మీద మోదీ అక్కసు వెళ్లగక్కారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లోనే అవినీతి జరుగుతోందని అన్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ ని బీజేపీ మించిపోయిందని జగదీశ్ రెడ్డి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అవినీతే ఆ పార్టీ పాలనకు సాక్ష్యాలని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబంపై మోదీ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. మోదీ హయాంలో రాఫెల్ కుంభకోణం జరిగిందని, బ్యాంకులకు పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని చెప్పారు.

కొద్దిమంది కోసం దేశాన్నే తాకట్టు పెడుతున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. వరంగల్ ప్రజల చైతన్యవంతులని, వారు మోదీ చెప్పిన అసత్యాలను నమ్మరని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని అన్నారు. మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తోడు దొంగలని అన్నారు. ప్రజల మధ్య గొడవలు సృష్టించి, ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు.

Srinivas Goud: మోదీ చేయాలనుకున్న ఈ కుట్ర విఫలమైంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్