ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీపై జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ కార్యాలయంకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు.. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ అయ్యారు.

Jalagam Venkat Rao

Jalagam Venkat Rao : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాలు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది. అయితే, ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీకి అవకాశం ఇవ్వాలని ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ కేంద్ర అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కేంద్ర అధిష్టానంకూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ సీనియర్లు ఖమ్మంను టీడీపీకి ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. ఇప్పటికే ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును బరిలోకి దింపాలని రాష్ట్ర పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో జలగం మంగళవారం బీజేపీ కార్యాలయంకు వెళ్లారు.

Also Read : ఖమ్మం పార్లమెంట్ బరిలో టీడీపీ? ససేమీరా అంటున్న బీజేపీ సీనియర్లు!

బీజేపీ కార్యాలయంకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు.. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ అయ్యారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీచేసే విషయంపై ఆయనతో జలగం చర్చించినట్లు సమాచారం. చంద్రశేఖర్ తివారితో సమావేశం అనంతరం జలగం వెంకట్రావు మీడియాతో మాట్లాడారు.. ఖమ్మం బీజేపీ టికెట్ తనదేనని చెప్పారు. ఖమ్మం టికెట్ పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు.

Also Read : బీజేపీలో చేరడం లేదు.. అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: శ్రీనివాస్ గౌడ్

టికెట్ ఎవరికనేది త్వరలో తెలుస్తుందని వెంకట్రావ్ పేర్కొన్నారు. ఖమ్మం టికెట్ టీడీపీ కేటాయిస్తారన్న అంశం నా పరిధిలోనిది కాదు.. పొత్తుల అంశం పార్టీ పెద్దలు చూసుకుంటారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ నాకే కేటాయిస్తారన్న విశ్వాసం నాకు ఉందని జలగం వెంకట్రావు అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు