Pawan Kalyan
Pawan Kalyan: తెలంగాణ పోరాట స్పూర్తే జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హైదరాబాద్ అజీజ్ నగర్‌లో జే.పీ.ఎల్ కన్వెన్షన్‌లో జనసేన తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుంచి హజరయ్యారు జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈ సంధర్భంగా సింగరేణికాలనీలో చనిపోయిన బాలిక ఆత్మకు శాంతి చేకూర్చాలని మౌనం పాటించారు పవన్ కళ్యాణ్. బాధితురాలి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందించిన పవన్ కళ్యాణ్.. జై తెలంగాణ నినాదం చేస్తూ ప్రసంగం మొదలుపెట్టారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తే జనసేన ఏర్పాటుకు నాందియని అన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం ఎంతోమంది ఆత్మబలిదానాలు చేశారని అన్నారు. సమాజంలో సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. మహాఅయితే ఓడిపోతాం.. లేదంటే ప్రాణం పోతుంది.. అడుగుపెడితే తప్ప అనుభవం రాదని అన్నారు. రాజకీయ చదరంగంలో జనసేన లాంటి చిన్న పావు అడుగేయాలంటే భయం వేస్తుందని అన్నారు. ఎన్నో దెబ్బలు, ఛీత్కారాలు, ఓటములు ఎదురయ్యాయని అయినా కూడా ఏపీలో ఎన్నో ఎంపీటీసీలను కైవసం చేసుకున్నామని అన్నారు.
రాజకీయాల్లో డబ్బుతో పనిలేదు.. పేరుతో పనిలేదు.. కేవలం గుండె ధైర్యం ఉంటే చాలని, అది నాకుందని అన్నారు. తెలంగాణకు నేను రుణగ్రస్తుడిని అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఆదిలాబాద్ వెళ్లినప్పుడు అక్కడి తండాలోని మహిళ నన్ను మంచినీళ్లు అడిగిందని గుర్తుచేశారు. ప్రజారాజ్యం ఓడిపోయినా దాన్ని నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమని అన్నారు.