Jubilee Hills By Election Polling
Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణ సమయాన్ని పొడిగించింది. తొలిసారి డ్రోన్ ల సాయంతో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేయనున్నారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలవగా.. ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 58మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
నియోజకవర్గంలో మొత్తం 4,01,365మంది ఓటర్లు ఉండగా.. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్లిప్ కంపల్సరీ కాదు.. ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు వీలు ఉంటుంది. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, పార్టీ గుర్తులు, ప్రచార వస్తువులు, పదునైన వస్తువులు తీసుకెళ్లడం నిషేధం.
ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎల్లారెడ్డిగూడ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును సునీత వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు.